వరంగల్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ ఆర్భాటంగా నిర్వహించిన వరంగల్ బహిరంగ సభ అయోమయంగా జరిగింది. ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ జిల్లా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. పేరుకు భారీ బహిరంగ సభ అయినా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. పాదయాత్రకు సైతం జిల్లాలో ఎక్కడా స్పందన కనిపించలేదు. బహిరంసభలోనూ ఇదే తీరుగా ఉంటుందని ముందే పసిగట్టి, ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో తరలించారు. నడ్డా ముందుగానే మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారు. అయితే, నడ్డా హిందీ ప్రసంగం విని జనం అయోమయానికి గురయ్యారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు అంటూ హిందీలో చెప్పిన లెక్కలు ఎవరికీ అర్థం కాలేదు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలపై నడ్డా మాట కూడా మాట్లాడలేదు. అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న బండి సంజయ్ ప్రకటనపై అందరు నవ్వుకున్నారు. గిరిజనుల రిజర్వేషన్ పెంపు, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా మోదీ సర్కారు పట్టించుకోలేదని అక్కడున్న జనాలు గుర్తుచేసుకొన్నారు.