హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు మహరాష్ట్ర ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. యవత్మాల్ జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు మంగళవారం బంజారాహిల్స్‌లోని హోంమంత్రి నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి హోంమంత్రి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వివిధ పార్టీలకు చెందిన వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, ఇతర నాయకులు గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు మహారాష్ట్ర ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తున్నదని చెప్పారు. తమకూ తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంపై అక్కడి ప్రజలకు నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజల ప్రధాన సమస్యలను పరిషరించేందుకు బీఆర్ఎస్ అవిశ్రాంతంగా కృషి చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన ఉపసర్పంచ్ మధుకర్ అల్లూర్వార్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళితబంధు, ఉచిత విద్యుత్తు వంటి పథకాలు మహారాష్ట్ర ప్రజలను ప్రభావితం చేశాయని తెలిపారు. మహారాష్ట్ర అభ్యున్నతికి బీఆర్ఎస్ కృషిని గుర్తించి పెద్దసంఖ్యలో పార్టీలో చేరుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో యవత్మాల్ జిల్లాలోని పఠాన్బురి, కేలాపూర్, కరంజి, కైర్గావ్, సున్న, వంజ్రి, కోపమంద్వి, పిప్పలుంటి, కొడ్డురి, పందరొద, మాంద్వి, చిలల్వార్డ, పార్వ తదితర గ్రామాలకు చెందినవారు ఉన్నారు.