జహీరాబాద్, మే 2: జహీరాబాద్ (Zaheerabad) నియోజకవర్గంలో ఎండలు (Summer) దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటలు దాటితే చాలు సూర్యుడు భగభగమంటుండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమి తట్టుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు నడిచినా ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండకు తోడుగా వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నియోజకవర్గంలోని న్యాల్కల్, కోహిర్, ఝరాసంగం, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల పరిధిలో 39 నుంచి 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇండ్లలో ఉన్న వారు సైతం ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. రోడ్ల పైకి వచ్చే వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెరుగుతున్న ఎండ తీవ్రతకు తగ్గట్లుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాత్రి చలి, మధ్యాహ్నం ఎండతో చాలా మంది జ్వరం, జలుబులతో ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. అందువల్ల శరీరంలో నీటి శాతం పెంచే తాజా పండ్లను అధికంగా తీసుకోవాలని సూచించారు. నూనెతో చేసిన వేపుళ్లు, హోటల్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని.. సల్ల, కొబ్బరి నీరు, రాగి జావ తాగితే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జహీరాబాద్ పట్టణానికి ఆయా మండలాల నుంచి ప్రజలు రావడం తగ్గిపోయింది. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇంటికే పరిమితం అవుతుండడంతో వ్యాపార సంస్థలు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. సాయంత్రం వేళల్లో కొద్దిమేరకే రద్దీ కనిపిస్తోంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు వ్యాపారులు గ్రీన్ టెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు మధ్యాహ్నం తర్వాత ఉన్నట్లుండి మేఘాలు కమ్ముకొని గాలి దుమారం, ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తుంది. ఫలితంగా ఇండ్లపై రేకులు ఎగిరిపోవడం, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి నేలకూలడం వంటివి జరుగుతుంది. కోతకు వచ్చిన పలు పంటలతో పాటు మామిడికాయలు నేలరాలిపోవడంతో రైతంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఒకవైపు అకాల వర్షాలు.. మరోవైపు ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎండల తీవ్రత, అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు.