భూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 20 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం భూపాలపల్లి మండలంలోని నేరేడుపల్లి, వజినేపల్లి, గొర్లవీడు, కొంపెల్లి గ్రామాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఒకే వేదికపై లక్షలాది మంది జై తెలంగాణ అని నినదిస్తే అధికార పక్షానికి దడ పుట్టాలని సూచించారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పాలనలో విఫలమైందని ఆరోపించారు.
ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను కాదని రేవంత్‌రెడ్డిని నమ్మి మోసపోయామని కంటతడి పెడుతున్నట్టు చెప్పారు.ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రజతోత్సవ సభ కోసం వాల్ రైటింగ్ చేయిస్తే కాంగ్రెస్ నాయకులు వాటిని తుడిచివేయిస్తున్నారని మండిపడ్డారు.ఈ నెల 26న నిర్వహించే జాబ్ మేళాను కావాలనే 27వ తేదీకి మార్చి పోలీసు అధికారులతో ప్రచారం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి గానీ ఇలాంటి దికుమాలిన పనులేంటని ప్రశ్నించారు.కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో హకులు సాధించుకోవాలని, లక్షలాదిగా రజతోత్సవ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలిని మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు.