Pharma Clusters | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఫార్మాసిటీ రద్దు అనంతరం ఔటర్ చుట్టూ ఉన్న జిల్లాల్లో 10 చోట్ల ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. ఒక్కో క్లస్టర్‌ను దాదాపు 2వేల ఎకరాలతో ఏర్పాటు చేయాలనుకుని, 20 వేల ఎకరాలను రైతుల నుంచి గుంజుకొని ఫార్మా సంస్థలకు అప్పగించాలని ప్లాన్ వేశారు. ఔటర్‌కు ఆర్ఆర్ఆర్కు మధ్య వికారాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో క్లస్టర్లో మూడునాలుగు ఫార్మా విలేజీలు అంటూ విచిత్రమైన ప్లాన్ వేసింది. ఈ మేరకు అధికారులు ఏయే గ్రామాల్లో అనుకూలమో ఫైల్‌ను సిద్ధం చేశారు. విషయం తెలిసినప్పటి నుంచే ఫార్మా క్లస్టర్లను వ్యతిరేకించడం మొదలుపెట్టారు.
ఒకే చోట 20 వేల ఎకరాలను వదిలిపెట్టి రైతుల నుంచి భూములు సేకరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందుగా తన సొంత ప్రాంతం నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గపరిధిలో ఉన్న దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో కలిపి 1373 ఎకరాల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. అంతే.. స్థానికులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. మొదట దుద్యాల మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. మంత్రుల వరకు వినతిపత్రాలు అందజేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఆగస్టు 21న దుగ్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. నెలలపాటు ఉద్యమాన్ని కొనసాగించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్, వడ్డీపూర్, మల్గి గ్రామాల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
భూములను పరిశీలించేందుకు వెళ్లినప్పుడే అధికారులను అడ్డుకున్నారు. ట్రెయినీ కలెక్టర్ మనోజ్, డిప్యూటీ కలెక్టర్ మాధురి, ఆర్డీవో రాజును అడ్డుకున్నారు. దాదాపు 4 గంటలపాటు అధికారులు కదలకుండా అడ్డుకున్నారు. 2003 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట డప్పూర్ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి సిబ్బందిని నిర్బంధించారు. ఆ తర్వాత దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 560 ఎకరాలను సేకరించింది. దీనికి అదనంగా మరో వెయ్యి ఎకరాలు సేకరిస్తారని ప్రచారం జరిగింది. దీంతో అక్కడి ప్రజలు ఫార్మా క్లస్టర్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలు పెట్టారు. దీంతో ప్రభుత్వం సైలెంట్ అయ్యింది. ఇలా ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ ప్రతిపాదించిన ప్రతి చోట ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతూనే ఉన్నది. సిద్ధంగా ఉన్న 20 వేల ఎకరాలను కాదని.. మా పచ్చని పొలాల్లో విషం చిమ్మేందుకు వస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.