హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభలు, వార్డు సభలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలకు గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సభల్లో ప్రజలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నది. సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు(Ration cards) రాలేదని అధికారులను నిలదీశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలో గ్రామసభలో ఆరు గ్యారెంటీలపై(Six guarantees) అధికారులను నిలదీశారు.
రెండు లక్షల రుణ మాఫీ కాలేదు.. తులం బంగారం ఇవ్వలేదు.. రైతు భరోసాకు ఇంతవరకు జాడ లేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మహబూబ్నగర్ జిల్లా మహమ్మాదాబాద్ మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామసభలో అర్హులైన లబ్ధిదారులకు ఆత్మీయ రైతు భరోసా జాబితాలో పేర్లు రాలేదని అసలైన లబ్ధిదారులు రెవెన్యూ అడిసషనల్ కలెక్టర్ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
అయితే జనం నోర్లు మూయించేందుకు పోలీసులు రంగంలోకి దిగి బలవంతంగా అడ్డుకుంటున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందంటూ ప్రజలు మండి పడుతున్నారు. మార్పు కోసం కాంగ్రెస్కు ఓటేస్తే మా బతులకును ఆగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నెల24 వరకు గ్రామ సభలు కొనసాగనున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ కోర్డుల కోసం అధికారులను నిలదీస్తున్న ప్రజలు