దేవరుప్పుల/పెద్దవంగర, జనవరి 24 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన గ్రామసభల పేరిట డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంటలో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఎర్రబెల్లి మాట్లాడారు. గ్రామసభల్లో ఈ ఊరుకు ఇన్ని ఇండ్లు వస్తున్నయ్.. అన్ని రేషన్‌కార్డులు వస్తున్నయ్.. ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తున్నామంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కారు వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఓ వైపు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం తాము అధికారికంగా ఇండ్లుకాని, రేషన్ కార్డులు కాని అనౌన్స్ చేయలేదని, గ్రామసభలో చదివేది అర్హులలిస్టేనని కరాఖండిగా చెబుతున్నపుడు గ్రామసభలెందుకని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం ఆపి, ఎన్నికల హామీలైన పింఛన్ల పెంపు, పెండ్లికూతురుకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ విమానం కిరాయలు దండగ చేశారని, రాష్ట్రంలో రియలెస్టేట్ కుప్పకూలిందని, కంపెనీలు తరలుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఫార్ములా రేస్, పారిశ్రామిక ఒప్పందాలతో ప్రపంచంలోనే అత్యున్నత పరిశ్రమలను తెలంగాణకు తెచ్చిన ఘనత, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్ధాయిలో తీర్చిదిద్దిన నైపుణ్యం కేటీఆర్ వద్ద ఉంటే, ఆయనను కేసుల పాల్జేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు నమ్మకం పోయిందని తెలిపారు.