CM Revanth Reddy | మహబూబ్నగర్, నవంబర్ 11 (తెలంగాణ ప్రతినిధి): సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆందోళనలు, నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. మార్పు వస్తుందని.. బతుకులు బాగుపడతాయని ఆశించిన నియోజకవర్గ ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. ఇచ్చిన హామీలు నీటి మూటలే కావడంతో జనం పోరుబాట పట్టారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సొంత పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో సైతం అసంతృప్తి పెల్లుబుకుతున్నది. పేరుకు మా ప్రాంత నేత సీఎం అయి 11 నెలలైనా ఒక్క కార్యక్రమం కూడా ముందుకు పడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలు కూడా అమలు కాకపోవడంతో జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
కొన్ని నెలలుగా నియోజకవర్గంలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో అధికార పార్టీకి పాలుపోవడం లేదు. పైగా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేసినా ఇప్పటివరకు ఒక్క చెప్పుకోదగిన పని కూడా పూర్తికాలేదు. సీఎం అయ్యాక రేవంత్రెడ్డి మూడు నెలల తర్వా త నియోజకవర్గంలో అడుగుపెట్టి రూ.3,9 61 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. అవి ఇంకా శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. హామీలను నెరవేర్చకపోవడంతోపాటు ప్రజలకు ఆలస్యంగానైనా అసలు విషయం తేటతెల్లమైంది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఏదో ఒక చోట, నిత్యం ధర్నాలు చేపడుతున్నారు. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఏర్పాటుచేసి దానికో అధికారిని నియమించి హడావుడి చేసినా ఇప్పటివరకు నయా పైసా ఖర్చు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి.