హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. యూపీలోనే కాదు శనివారం పోలింగ్ జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నికలోనూ బీజేపీకి ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 100 స్థానాల్లో పోటీ చేస్తుందని, అక్కడి సీఎం యోగీ ఆదిత్యనాథ్ తిరిగి అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ విభజన రాజకీయాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ముస్లింలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. త్రిపురలో 15 మసీదులను ధ్వంసం చేస్తే, ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద ముస్లింలకు 10 ఇండ్లు కూడా కేటాయించలేదని విమర్శించారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష
తెలంగాణలో బహుజనవాదాన్ని, లౌకిక కట్టుబాటును చెదరగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని అసదుద్దీన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో పక్షపాతం వహిస్తున్నదని, ఆర్థిక సహకారం అందించడం లేదని ఆగ్రహించారు. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో భారీ వర్షాలతో వరదలు వచ్చినప్పుడు ఎలాంటి సాయం చేయలేదని, అదే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏదైనా విపత్తు వస్తే వెంటనే సాయం అందించారని గుర్తుచేశారు. హుజూరాబాద్ ప్రజలకు బీజేపీ విభజన రాజకీయాలపై మంచి అవగాహన ఉన్నదని, ఈ ఉపఎన్నికలో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, ఐటీ ఎగుమతులు పెరిగాయని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా శాంతిభద్రతలకు ఢోకా లేదని కొనియాడారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయి అభివృద్ధికి శాంతిభద్రతలే కారణమని చెప్పారు. ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసుల పనితీరు అద్భుతమని ప్రశంసించారు. ప్రజలు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెటుకొని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుమారు 60 వేలమంది ముస్లిం బాలబాలికలు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకుంటున్నారని గుర్తుచేశారు.