వైరా టౌన్, నవంబర్ 25 : కూలిందా? పేల్చిందా? తెల్వదు కానీ కాళేశ్వరంలో ఒక పిల్లరు కుంగితే కాంగ్రెసోళ్లు నానా రభస చేసిండ్రు. గోదావరి నదీగర్భంలో కట్టిన మేడిగడ్డలో మొత్తం 85 పిల్లర్లలో ఒక పిల్లరుకు ఇబ్బంది ఎదురైతే ఎక్కడాలేని ఆరోపణలు గుప్పించిన్రు. గోదావరి నదికి చరిత్రలోనే లేనంత వరద వచ్చినా బరాజ్ చెక్కుచెదరకుండా నిలిచిన వైనాన్ని మరచి, కుంగిన పిల్లరును కాళేశ్వరం ప్రాజెక్టు అన్నంతగా చూపించిన్రు. గోదావరి మీద అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెసోళ్లు ఎన్నటికీ కట్టలేరని అందరికీ తెలుసు. విషాదం ఏమిటంటే చివరికి చిన్న వాగు మీద కట్టిన చిట్టి వంతెనను కూడా తాము కట్టలేమని వారు నిరూపించుకున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి సొంత ఊళ్లో వంతెన కూలిన ఘటనను ప్రస్తావిస్తూ ‘యేట్లో రాయి తీయనోడు కూట్లో తీస్తడా’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
‘ప్రజాపాలన’ అని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సోమవారం ఖమ్మం జిల్లా స్నానాల లక్ష్మీపురం వద్ద హైలెవల్ వంతెన పిల్లర్ కుప్పకూలడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. నిర్మాణ దశలోని వంతెన పిల్లర్ ఒక్కసారిగా కూలడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత గ్రామంలోనే ఇలా జరగడంతో అందరూ అవాక్కయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఇక్కడే స్పష్టంగా కనిపిస్తున్నదంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. గండుగలపాడు నుంచి స్నానాల లక్ష్మీపురం మీదుగా సిరిపురం వరకు సుమారు 6 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టింది.
ఇందులో భాగంగా స్నానాల లక్ష్మీపురం వద్ద వైరా నదిపై వంతెన నిర్మిస్తున్నారు. మొత్తం 12 పిల్లర్లను నిర్మిస్తుండగా 8 పిల్లర్లు పూర్తిగా నదిలో.. చివరన నాలుగు పిల్లర్లు నిర్మిస్తున్నారు. చివరన నిర్మిస్తున్న ఒక పిల్లర్ సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. నదిపై ఉన్న పిల్లర్లకు స్లాబ్ వేసి అప్రోచ్ రోడ్డు వేయాల్సి ఉండగా నాణ్యతాలోపం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పిల్లర్ కూలింది. ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కాగా పడిపోయిన పిల్లర్‌ను కప్పిపుచ్చేందుకు ఆగమేఘాల మీద మధ్యాహ్నం రెండు జేసీబీలు తెచ్చి మట్టిపోశారు. అధికారులు మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు.
బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత కచ్చితంగా పాటించాలి. ప్రస్తుతం జరుగుతున్న వంతెన నిర్మాణం చూస్తే చాలా అసంతృప్తిగా ఉంది. వైరా నదిపై నిర్మిస్తున్న వంతెన పిల్లర్ కూలిపోవడం అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనం. తక్షణమే నాణ్యతా ప్రమాణాలతో బ్రిడ్జి నిర్మాణం కొనసాగేలా చూడాలి.
– చీతోజు వెంకన్న, స్నానాల లక్ష్మీపురం
అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పిల్లర్ కూలింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నాణ్యత పర్యవేక్షించకుండా ఏం చేస్తున్నట్టు? నిర్మాణ దశలోనే పిల్లర్ కూలితే ఇక బ్రిడ్జి ఎంత నాణ్యతతో నిర్మిస్తున్నారనేది అర్థమవుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకుంటే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం.
– మైబ్ జానీ, స్నానాల లక్ష్మీపురం