హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ మునుగోడు ఉపఎన్నిక తెచ్చిందని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఆ పార్టీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా, కుట్రలు పన్నినా టీఆర్ఎస్(బీఆర్ఎస్) విజయం ఖాయమన్నారు. ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే మునుగోడు ఓటర్లు బలపరుస్తున్నారని చెప్పారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిలతో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తెలంగాణకు ఎంతో ముఖ్యమని, బీజేపీ నాయకులు వెదజల్లే డబ్బుకు ఓటర్లు అమ్ముడుపోరని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీర్చలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇంటింటికీ మంచినీళ్లిచ్చి మహమ్మారిని తరిమికొట్టారని పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికను ముందుపెట్టి తెలంగాణను ఆగం చేసేందుకు కమలం పార్టీ కుట్రలు చేస్తున్నదని, ఇందులో భాగమే కారు పోలిన గుర్తులను పెట్టేలా చేశారని ఆరోపించారు.
తెలంగాణ నుంచి ఫ్లోరైడ్ సమస్య పోయిందనుకుంటే, బీజేపీ నాయకులు సోరియాసిస్ మాదిరి తయారయ్యారని ఎద్దేవా చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రం నుంచి ఎన్నికోట్లు తెచ్చారో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ కుట్రలకు మోసపోతే మళ్లీ చీకటి రోజులు వస్తాయని హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఖతం చేస్తామని బీజేపీ నాయకులు శపథం చేస్తున్నారని, కానీ దేశంలో బీజేపీని ఖతం చేయడానికి సీఎం కేసీఆర్ బయలుదేరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో 134 బీసీ కులాలుంటే అన్నింటికీ ఏదో ఒక రూపంలో మేలు జరిగిందని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్‌పై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.
గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు హర్షణీయం:సీఎంకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రవిచంద్ర కృతజ్ఞతలు
రాష్ట్రంలో లారీలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపునకు సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షణీయమని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ లారీ యజమానుల సంఘం నిర్వహించిన కృతజ్ఞతా సమావేశంలో వారు మాట్లాడుతూ.. లారీ యజమానుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, గ్రీన్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని కోరామన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి గ్రీన్ టాక్స్‌ను కొంత మేర తగ్గించేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. లారీ యజమానుల్లో సంతోషాన్ని నింపిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు నూకల భాస్కర్‌రెడ్డి, గౌరవ చైర్మన్ గుమ్మడి దుర్గాప్రసాద్, అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రామినేని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్‌పాషా, కోశాధికారి వేముల భూపాల్, సలహాదారు ఆవుల రామారావు, రామచంద్రారెడ్డి, షాద్‌నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ సాదిక్ భాయ్, సహాయ కార్యదర్శి కొయ్యాడ సుధాకర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.