సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రజలే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల వారు కూడా కంటి వెలుగు కార్యక్రమంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా తమ కళ్లను చెక్ చేయించుకున్న ఏపీ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని కుమురబండలోని బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో.. విశాఖపట్టణానికి చెందిన ఓ నలుగురు వ్యక్తులు తమ కళ్లను చెక్ చేయించుకున్నారు ఈ నలుగురు కోదాడలోని తమ బంధువుల ఇంటికి ఇటీవలే వచ్చారు. దీంతో కల్లెంపూడి ద్వారకనాథ్, విజయలక్ష్మి, వడపల్లి మోహన్ రావు, లక్ష్మి తమ కళ్లను చెక్ చేయించుకున్న తర్వాత.. కంటి వెలుగు ప్రోగ్రాం బాగుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటారని తెలిపారు.

ఈ సందర్భంగా ద్వారకనాథ్(76) మాట్లాడుతూ.. తనకు ఇప్పటి వరకు ఎలాంటి కంటి సమస్య రాలేదని తెలిపాడు. కానీ ఇవాళ కళ్లను చెక్ చేయించుకోవడంతో.. ఎడమ కన్నులో చిన్న సమస్య ఉందని తేలింది. అందుకు డాక్టర్ మెడిసిన్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపాడు.
కంటి వెలుగు క్యాంపు ఇంచార్జి డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతూ.. ఏపీకి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఆధార్ కార్డులతో వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారి వారి సమస్యల ఆధారంగా మెడిసిన్స్ రాసిచ్చినట్లు డాక్టర్ తెలిపారు.