నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్31(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, అభిమాన నాయకుడు, సీఎం కేసీఆర్‌ను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఆయన చెప్పే మాటలు వినేందుకు ఊరూరా దారిబట్టారు. జనంహోరుతో కృష్ణపట్టె ప్రాంతమంతా గులాబీ ప్రవాహంలా హోరెత్తింది. కృష్ణా జలాల్లో నీటివాటాను కొట్లాడి సాధించుకొచ్చిన జలనేత కేసీఆర్‌కు నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు జనం నీరాజనం పట్టింది.
మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారు. గిరిజనులు అధికంగా ఉండే దేవరకొండ నియోజకవర్గంలో కేసీఆర్ కోసం జనం ప్రభంజనంలా తరలివచ్చారు. మూడు చోట్లా ఎటుచూసినా జనం చీమల దండులా ప్రజాఆశీర్వాద సభలకు తరలివచ్చి విజయవంతం చేశారు.

Brs
జన జాతరను తలపించిన సభలు
హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్వంలో జరిగిన ప్రజాఆశీర్వాద సభ జనంతో హోరెత్తింది. హుజూర్నగర్ పట్టణంతోపాటు ఏడు మండలాల నుంచి సభకు వేలాదిగా తరలివచ్చారు. పట్టణంలో చీమలదండు వరుసలా జన ప్రవాహం సభాస్థలి వరకు కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ హాజరవుతారని ప్రకటించగా ఉదయం 11 గంటల నుంచే జనం తండోపతండాలుగా తరలివచ్చారు.
దళితబంధు గురించి ప్రస్తావించగానే పెద్దఎత్తున కేరింతలు వెల్లువెత్తాయి. రైతుబంధు వద్దు అనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కావాలా? ఉండాలనే సైదిరెడ్డి కావాలా? అని ప్రశ్నిస్తే సైదిరెడ్డినే అంటూ జనం ఒక్కపెట్టున కేకలు పెట్టారు. మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ప్రజాఆశీర్వాద సభ జనజాతరను తలపించింది. నియోజకవర్గవ్యాప్తంగా జనం భారీగా తరలివచ్చారు.
చీమలదండులా మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలైన జనప్రవాహం కేసీఆర్ వచ్చే వరకు విరామం లేకుండా కొనసాగింది. మిర్యాలగూడ పట్టణం ఎటుచూసినా గులాబీవనాన్ని తలపించింది. భాస్కర్‌రావును లక్ష మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేవరకొండలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. తండాలకు తండాలే సభకు తరలివచ్చాయి. దేవరకొండ ఖిల్లా గులాబీమయమైంది.
40 ఎకరాల్లో నిర్వహించిన బహిరంగ సభకు 80 వేలకు పైగా జనం తరలివచ్చినట్టు అంచనా. మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గిరిజనులు సంప్రదాయ వస్త్రధారణతో నృత్యాలు చేస్తూ పాటలు పాడి అలరించారు. ఆయా ప్రజాఆశీర్వాదసభల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, తిరునగర్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.