Samagra Kutumba Survey | హైదరాబాద్, నవంబర్9 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వే సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం పెల్లుబుకుతున్నది. సర్వే వివరాల సేకరణకు వెళ్లిన ఎన్యుమరేటర్లకే ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ‘ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ? ఆరు గ్యారెంటీలు ఏమాయె? 420 హామీలు ఎటుపాయె? మళ్లీ కొత్తగా సర్వే ఎందుకు? వివరాలు చెప్పుడెందుకు?’ అంటూ అధికారులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ‘సర్వే లేదు.. ఏదీ లేదు.. మాకు ఈ ప్రభుత్వమే వద్దు” అంటూ తిప్పి పంపుతున్నారు. దీంతో చేసేదేమీలేక అరకొర సమాచారంతో, అందించిన వివరాలతోనే ఎన్యుమరేటర్లు తొలిరోజైన శనివారం తిరుగుముఖం పట్టారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని పలువురు ఎన్యుమరేటర్లే బాహాటంగా వాపోతున్నారు.
సర్వే చేయలేమంటూ కొందరు చేతులెత్తేస్తున్న పరిస్థితి నెలకొన్నది అంటే ప్రభుత్వంపై ఎంతగా వ్యతిరేకత ఉన్నదో దీన్నిబట్టే తెలుసుకోవచ్చు. సర్వే సందర్భంగా ఎన్యూమరేటర్లను ప్రజలు ఇంటింటా నిలదీస్తున్నారు. ఎన్యూమరేటర్లు సమాచార సేకరణకు ప్రశ్నలేయడం అటుంచితే, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపై ఎక్కడికక్కడ ఎదురుప్రశ్నలు ఎదురై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎక్కడికి వెళ్లినా? ఎవరిని పలకరించినా? సర్వే ఎందుకు? కొత్తగా ఏమోస్తది? ఏం చేశారు? ఏం చేస్తరు?’ అంటూ అడుగడుగునా ప్రశ్నిస్తున్నారని స్వయంగా ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు కొలువుదీరి ఏడాది కావస్తున్నా ఏ ఒక్క పథకం, హామీని అమలు చేయలేదని, మాటలు చెప్పి మోసం చేశాడని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని క్షేత్రస్థాయి అధికారులు తెలుపుతున్నారు.
అంతేకాదు ఇప్పటికే రైతుబంధు ఇవ్వలేదని, రైతు రుణమాఫీ అందరికీ కాలేదని రైతాంగం, రూ.2,500 ఎక్కడని మహిళలు, పింఛన్లు పెంచలేదని ఆసరా లబ్ధిదారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తమకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. తమకు ఏ పథకం ఇవ్వని ప్రభుత్వానికి వివరాలెందుకు ఇవ్వాలని తిప్పి పంపుతున్నారని అధికారులు స్వయంగా చెప్తున్నారు. కుటుంబ ఆదాయం, అప్పులు, ఆస్తిపాస్తుల అంశాలపై నోరుమెదపడమే లేదని, ఆ వివరాలను ఎందుకు అడుగుతున్నారని, వచ్చే పథకాలను కూడా రాకుండా చేస్తారా? అంటూ ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. కుటుంబ వివరాలు తప్ప మరే వివరాలను చెప్పేందుకు కూడా ప్రజానీకం ముందుకు రావడం లేదని అధికారులు చెప్పడం గమనార్హం.
పట్టణాలు, నగరాల్లో గందరగోళం
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సర్వే తీరు మరింత దారుణంగా ఉన్నదని క్షేత్రస్థాయి అధికారులు వాపోతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సర్వే కోసం వెళ్లిన ఇద్దరు ఎన్యూమరేటర్లపై ఓ ఇంటి యజమాని కుక్కలను ఉసిగొల్పగా, మరోచోట ఓ యజమానురాలు ఏకంగా దాడికి దిగినంత పనిచేసింది. అలాగే పలువురు సంపన్న శ్రేణి, ఎగుమ మధ్యతరగతి గృహ యజమానులైతే ఇండ్లకు స్టిక్కరింగ్ చేసేందుకు కూడా సహకరించడం లేదని, వద్దని తిప్పి పంపుతున్నారని తమ అనుభవాలు చెప్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలోకి అనుమతించడమే లేదని వాపోతున్నారు.
అనేక రకాలుగా ప్రయత్నించి ఒకవేళ నివాస సముదాయాల్లోకి వెళ్లినా అక్కడ కూడా ప్రశ్నలు, నిలదీతలే ఎదురవుతున్నాయని, వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొన్నదని ఎన్యూమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. నగరాల్లోని అపార్ట్మెంట్లలో నివసించే కుటుంబాల సేకరణ మరింత సవాల్‌గా మారిందని ఎన్యూమరేటర్లు వివరిస్తున్నారు. ఇండ్లకు వెళ్లే సమయానికి అపార్ట్మెంట్లలో ఎవరూ ఉండటం లేదని, ఉన్నా కూడా సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారని, ఎప్పుడు వస్తారో తెలియకుండా ఇంట్లోనే ఎలా ఉంటాం. మాకేమీ పనిలేదా అంటూ ప్రశ్నిస్తున్నారని ఎన్యూమరేటర్లే స్వయంగా వెల్లడిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఎన్యూమరేటర్లపై సర్కారు ఒత్తిడి
సర్వే కోసం వెళ్లిన అధికారులను నిలదీయడంతోపాటు, పలువురు వీడియోలు కూడా తీసి సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు అనేక విధాలుగా కామెంట్లు పెడుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా కూడా ప్రభుత్వంపై ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకతను వ్యక్తపర్చడం గమనార్హం. ఈ విషయం తెలిసిన ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తున్నది. ప్రజలు వీడియోలు తీసేందుకు అంగీకరించవద్దని, అలా చేస్తే అక్కడి నుంచి వెళ్లిపోయేలా చూడాలని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ఇప్పటికే వైరల్‌గా మారిన వీడియోలను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని కూడా సంబంధిత సైబర్ విభాగం అధికారులకు హుటాహుటిన ఆదేశించారని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి.
తొలిరోజే తీవ్ర వ్యతిరేకత
ఇంటింటి సర్వే ప్రారంభమైన తొలిరోజైన శనివారం ఊహించని చేదు అనుభవాలు ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వివరాలను ఇచ్చేందుకు ప్రజానీకం పూర్తి విముఖతను చూపుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్టిక్కరింగ్ ప్రక్రియ ముగిసిపోగా, ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణను శనివారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొన్నారు. సర్వే ఫారాలో ప్రధాన ప్రశ్నలు 57, ఉపప్రశ్నలు 18 కలిపి మొత్తంగా 75 ప్రశ్నలతో కూడిన ఫారాలను పూర్తిగా నింపాల్సి ఉన్నది. దాదాపు ఈ ప్రక్రియ 10 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనున్నది. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 10 ఇండ్ల చొప్పున వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఒక్కో సర్వే కాపీ నింపడానికి గంట పైనే పడుతుందని ఎన్యూమరేటర్లు వివరిస్తున్నారు. సమాచార సేకరణకు ప్రజలను అనేక విధాలుగా ఒప్పించాల్సి వస్తున్నదని, అప్పటికీ అరకొరగానే వివరాలు వస్తున్నాయని తెలుపుతున్నారు. మొత్తంగా నవంబర్18లోగా సర్వే ముగించడం కష్టమేనని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
భయం లేకుండా గుడికి వెళ్తున్నారా?
ఇంటింటి సర్వే ఫారంలో ప్రభుత్వం ఇప్పటికే పొందుపరిచిన ప్రశ్నలపై అనేక విధాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆ జాబితాలో మరో 3 ప్రశ్నలను జోడించగా వాటిపైనా ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో నో క్యాస్ట్, నో రిలీజియన్ కాలమ్ చేర్చగా, అవిగాకుండా మరో 2 ప్రశ్నలను ప్రభుత్వం జాబితాలో చేర్చింది. 55వ ప్రశ్నగా కుటుంబంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నారా? 56వ ప్రశ్నగా మీ కుటుంబంలోని సభ్యులు ఎలాంటి బెదిరింపులు, వివక్ష లేకుండా స్థానిక ఆలయాలకు, మసీదులకు, చర్చిలకు, ఇతర ప్రార్థనాలయాలకు వెళ్తున్నారా? అని పొందుపరిచింది. ఈ రెండు ప్రశ్నలను చేర్చడంలో ప్రభుత్వ ఆంతర్యమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవిగాక ప్రశ్నావళిలో అనేక అసంబద్ధ ప్రశ్నలను పొందుపరిచిందని సామాజికవేత్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రుణం ఎంత తీసుకున్నారు? ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇంటి విస్తీర్ణం ఎంత? ఎన్ని గదులు ఉన్నాయి? మీ ఇంట్లో ఎన్ని ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు, పందులు ఉన్నాయి తదితర అనవసర ప్రశ్నలు అనేకం ఉన్నాయని ఇటు ప్రజలు, అటు ఎన్యూమరేటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బంజారాహిల్స్‌లోని అరోరా కాలనీలో సర్వేకు వెళ్లిన తమపై యజమానులు కుక్కలు వదిలినట్టు చెబుతున్న టీచర్లు అపురూప, రమ్యశ్రీ
గుండ్లపల్లి, దిలావర్పూర్లోనూ సర్వే చేయాలి: బీసీ కమిషన్
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి, దిలావర్పూర్ గ్రామాల్లోనూ సర్వే నిర్వహించేందుకు చొరవ చూపాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను ఆదేశించారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ ఆయా గ్రామాల ప్రజలు సమగ్ర కుటుంబ సర్వేను బహిషరించాలని నిర్ణయించారు. దీనిపై స్పందించిన చైర్మన్.. కలెక్టర్‌తో ఫోన్లో సంప్రదించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామస్తులను సంప్రదించి సర్వే ప్రయోజనాలను వివరించాలని, సర్వేను అడ్డుకోకుండా ఒప్పించాలని ఆదేశించారు.
ఇంటింటి సర్వేలో భాగంగా ఇండ్లకు స్టిక్కర్లు వేసేందుకు వెళ్లిన పలువురు ఎన్యూమరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇంటింటా తమనే ఎదురు ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ అధికారికి ఎదురైన అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘ఇండ్లకు స్టిక్కర్లు పెట్టడానికి వెళ్తే మాకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నరు. మాకేమిస్తున్నారు? సీఎం రేవంత్‌రెడ్డి మాకేమిచ్చిండు? ప్రజాపాలన అని దరఖాస్తులు తీసుకుపోయారు. రెండు మూడు రోజులు లైన్ల నిలబడి ఫారాలు నింపి ఇచ్చినం. అవి ఎక్కడ? ఏం చేశారు? గ్యాస్ ఇస్తానన్నాడు ఇవ్వలేదు. ఇండ్లు ఇస్తానన్నాడు ఇవ్వలేదు. వచ్చే పింఛన్లు కూడా ఇప్పుడు సరిగా వస్తలేవు. రేషన్‌కార్డులు కూడా ఉన్నోళ్లకు ఉన్నయ్. లేనోళ్లకు లేవు. ప్రతీ ఆడామె కూడా రూ.2,500 ఏవీ అని అడుగుతున్నరు. ఇప్పుడు ఇండ్ల నంబర్లను ఇస్తున్నం కదా. చెరువులల్ల ఇండ్లను కూల్చినట్టు మా మీద ఏమన్న జరిమానా వేస్తరేమో? మీరొచ్చి బాధ్యత వహిస్తరా? అని ప్రజలు అడుగుతున్నరు. మాకు ఏమొచ్చినయ్ అని ముసలోళ్లు అయితే మస్తు తిడుతున్నరు. ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని ఘోరంగా తిడుతున్నరు. మాకేమీ రాదు.. మాకేమీ వద్దు.. మా వివరాలు ఏం అడగొద్దు.. మీరేమీ అనుకోవద్దు వెళ్లిపోండి.. మాకు ప్రభుత్వం ఏం ఇస్తలేదు. సపోర్ట్ చేస్తలేదు. మేం కూడా సపోర్ట్ చేయం. అయినా మా ఆస్తి, అప్పుల గురించి అడిగే హక్కు ఎక్కడిది? అధికారం ఇచ్చినోళ్లను తీసుకురా పో’ అంటూ వెళ్లగొడుతున్నారు’ అని ఆయన చెప్పారు.
(పెద్దపల్లి జిల్లా) (టీచర్)
గృహ యజమాని: ఎవలు మీరు. ఏం కావాలి?
ఎన్యూమరేటర్: నేను టీచర్‌ను అమ్మ. సర్వే కోసం వచ్చిన.
గృహ యజమాని: సర్వే లేదు ఏం లేదు పో!
ఎన్యూమరేటర్: అట్ల కాదమ్మ. సర్కారు పంపింది. వివరాలు చెప్పితే మంచి జరుగుతది. సర్కారు మంచి చేస్తది.
గృహ యజమాని: మా సాలు చేసిన మంచి. పింఛన్ పెంచుతన్నడు. ఏం పెంచిండు? గ్యాస్ ఇత్తనన్నడు ఇచ్చిండా? ఓ మళ్ల వచ్చిండ్లు. నేనేం చెప్ప.
ఎన్యూమరేటర్: అట్లా కాదమ్మా! మీవోళ్లు ఎవలు లేరా?
గృహ యజమాని: ఎవలు లేరు పో.
ఎన్యూమరేటర్: చేసేదేమీలేక స్టిక్కర్ వేయకుండానే వెనుదిరిగిన పరిస్థితి.
ప్రాంతం: జీహెచ్ఎంసీ పరిధిలోని మేడ్చల్ (ఆశావర్కర్)
గృహ యజమాని: ఏం పేరమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు?
ఎన్యూమరేటర్: సమగ్ర ఇంటింటి సర్వే కోసం జీహెచ్ఎంసీ నుంచి వచ్చా.
గృహ యజమాని: సర్వే ఎందుకోసం. ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది?
ఎన్యూమరేటర్: సీఎం రేవంత్‌రెడ్డిని అడగండి..
గృహ యజమాని: మరి మీరెందుకొచ్చారు?
ఎన్యూమరేటర్: కలెక్టర్ పంపిస్తే వచ్చాం
గృహ యజమాని: మీకు అవగాహన లేదన్నమాట?
ఎన్యూమరేటర్: లేకుండా ఎందుకు వస్తం. అవగాహన ఉన్నది.
గృహ యజమాని: అయితే సర్వే ఎందుకో వివరంగా చెప్పండి.
ఎన్యూమరేటర్: మీ కుటుంబ సభ్యుల వివరాలు, ఏం చదువుకున్నారు? ఉద్యోగం చేస్తున్నారా? ఆదాయం ఎంత వస్తుంది? ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతున్నారా? రాజకీయం, మీ కు లం అన్ని వివరాలను నమోదు చేస్తాం.
గృహ యజమాని: ఈ వివరాలతో ఏం చేస్తరు? ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది?
ఎన్యూమరేటర్: కలెక్టర్‌కు ఇస్తాం. వాళ్లు ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ఇస్తరు.
గృహ యజమాని: మా పర్సనల్ వివరాలతో వాళ్లేం చేస్తరు?
ఎన్యూమరేటర్: మీ పర్సనల్ వివరాలను ఇప్పుడేం అడగలేదు. కేవలం స్టిక్కర్ వేస్తాం. తర్వాత వివరాలు తీసుకుంటాం.
గృహ యజమాని: పేరైనా ఎందుకు అడుగుతున్నరు? ఏం తెల్వకుండా ఎందుకు వచ్చిన్రు? సర్వే దేనికి ఉపయోగపడుతది?
ఎన్యూమరేటర్: పేదలకు లాభం జరుగుతది. ఉపాధి పథకాలు అందుతయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. లేదంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి.
గృహ యజమాని: సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఎంతమందికి ఏమిచ్చిండు. గ్యారెంటీలు ఏమైనయ్? గ్యారెంటీలు అంటే ఏంటో తెలుసా?
ఎన్యూమరేటర్: గ్యారెంటీలు అంటే హామీలు
గృహ యజమాని: హామీ అంటే నేను చేస్తా అని ఒప్పుకోవడం. మరేం చేసిండు ఇప్పటివరకు?
ఎన్యూమరేటర్: నేను రాజకీయంగా రాలేదు. నన్ను ఈ ప్రశ్నలు అడగొద్దు.
గృహ యజమాని: రాజకీయంగా రాకపోతే ఎందుకచ్చినవ్. రేవంత్‌రెడ్డి రాజకీయంగా రాకపోతే ఆయనంత ఆయనే ఓట్లు వేసుకుని గెలిచిండా? మీకు కూడా హక్కుంది కదా? మీకేమన్న హామీలు వచ్చినయా?
ఎన్యూమరేటర్: సమాధానం లేకుండానే అక్కడి నుంచి వెనుదిరిగి పోయారు.