యాచారం, అక్టోబర్ 22: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం లో గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూసేకరణ కోసం ఆర్డీవో అనంతరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ అయ్య ప్ప అధ్యక్షతన బుధవారం జరిగిన ప్రజావేదిక కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గ్రామంలోని సర్వే నంబర్ 19,68,127లో అసైన్డ్ ల్యాండ్ 821 ఎకరాలు, సర్వే నంబర్ 69 నుంచి 84 వరకు 174 ఎకరాల పట్టా భూమి సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, భూసేకరణపై అభిప్రాయాలు చెప్పాలని రైతులను అధికారులు కోరారు. తమ భూముల జోలికి రావొద్దని రైతులు స్పష్టంచేశారు. ప్రాణాలు పోయినా భూములిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసి, ప్రక్రియను నిలిపివేయాలని మాజీ సర్పంచ్ బండిమీది కృష్ణ, గ్రామ నాయకులు తాండ్ర రవీందర్, అంజయ్యయాదవ్, యాదగిరిరెడ్డి, బొడ్డు రవి, కుమార్, నరేశ్, సత్తయ్య, శ్రీను, రైతులు డిమాండ్ చేశారు. భూసేకరణకు రైతులు సహకరించాలని ఆర్డీవో అనంతరెడ్డి కోరగా రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్డీవో గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ‘ప్రాణాలు పోయినా.. ..భూములు ఇవ్వం’ అంటూ తేల్చిచెప్పారు. దీంతో రైతులు అధికారుల వద్దకు వెళ్లకుండా పోలీసులు అదుపు చేశారు. అనంతరం పోలీసులు ఉన్నతాధికారులు రైతులతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
భూసేకరణ కంటే ముందు గ్రామంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రామంలో చాలా ఏండ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను ఇప్పటివరకు ఆన్లైన్లో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. 42మంది రైతులు ఆన్లైన్లో పేర్లు లేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. కొంత మంది తమ పలుకుబడితో నకిలీ అసైన్డ్ సర్టిఫికెట్లను తయారు చేసుకున్నట్టు రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి వారిని అసైన్డ్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పట్టాలు పొంది చాలా ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేర్లను భూభారతిలో నమోదు చేయాలని పట్టుబట్టారు. గ్రామంలో భూముల సర్వే చేపట్టి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, నకిలీ పట్టాలు పొందినవారిపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు.
ప్రభుత్వం చేపట్టే భూసేకరణలో ఎకరాకు రూ.కోటి పరిహారం ఇస్తేనే తమ భూములను ప్రభుత్వానికి ఇస్తామని కొందరు రైతులు ముందుకొచ్చారు. తమ భూములు సాగుయోగ్యంగా ఉన్నాయని, పుదీనా, కూరగాయల పంటలు సాగు చేసుకుంటున్నామని అలాంటి భూములను తక్కువ ధరకు ప్రభుత్వానికి ఇస్తే ఎలా బతకాలని వాపోయారు. కోటి రూపాలయల పరిహారం ఇస్తేనే భూములిస్తామని డిమాండ్ చేస్తూ ఆర్డీవోకు లేఖ సమర్పించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని ఆర్డీవో అనంతరెడ్డి చెప్పారు.