Power Cuts | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్ఫార్మర్పై తొండ పడింది. కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్ఫార్మర్పై బల్లి పడింది. కరెంటు ఎందుకు పోయింది..? ట్రాన్స్ఫార్మర్పై పక్షి వాలింది. ఇవీ.. కరెంటు కోతలపై విద్యుత్తు సిబ్బంది చెప్తున్న కారణాలు. తాజాగా, హైదరాబాద్‌లోని సైబర్‌సిటీ ప్రాంతంలో కరెంటు పోవటంతో ఇలాంటి కారణమే చెప్పి నెటిజన్ల ముందు నవ్వులపాలు అవుతున్నారు.
సైబర్ సిటీకి చెందిన ఓ వినియోగదారుడు గురువారం తెల్లవారుజామున 5 గంటలకే కరెంట్ పోయిందని అధికారులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అరగంట వ్యవధిలో స్పందించిన విద్యుత్తు సిబ్బంది సంబంధిత ట్రాన్స్ఫార్మర్ వద్దకు వచ్చి తనిఖీ చేశారు. రెండు బల్లులు కొట్లాడుకొని డీటీఆర్‌పై పడి చనిపోయాయని, దాంతో కరెంట్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. వి ద్యుత్తు సిబ్బంది చెప్తున్న కారణాలపై నె టిజన్లు ఆటాడుకుంటున్నారు. మొత్తానికి రెండ్రోజులుగా తొండలు, బల్లులు కూడా హైదరాబాదీలకు కరెంటు కష్టాలు తెచ్చేందుకు పోటీపడుతున్నాయని ఛలోక్తులు విసురుతున్నారు.