హైదరాబాద్,ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డికి ప్రజలు ఆదివారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సురవరం అంతిమయాత్ర కొనసాగింది. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ దవాఖానలో ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అక్కడే ఉన్న ఆయప పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర సమితి కార్యాలయమైన మగ్ధూంభవన్‌లో ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. కడసారి తమ అభిమాన నాయకుడిని చూసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలు పార్టీల నేతలు, ప్రముఖులు, అభిమానులు మగ్ధుంభవన్కు తరలివచ్చి, సురవరం పార్థివదేహానికి నివాళుర్పించారు.
ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని, ఆయన మృతి తీరని లోటని పేర్కొంటూ సంతాప తీర్మానాలను రాశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్ఎస్ సీనియర్ నేత బీ వినోద్‌కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ముఠా గోపాల్, సినీనటుడు ఆర్ నారాయణమూర్తి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు సురవరం పార్థివదేహానికి నివాళులర్పించారు. అక్కడే ఉన్న సురవరం కుటుంబ సభ్యులు వారు పరామర్శించారు. మఖ్ధూంభవన్‌లో గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం మగ్ధూంభవన్ నుంచి గాంధీ దవాఖాన వరకు సుధాకర్‌రెడ్డి పార్థివదేహానికి అంతిమయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన సీపీఐ నేతలు, కార్యకర్తలతోపాటు వివిధ పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం కుటుంబసభ్యులు ఆయన భౌతికకాయాన్ని అప్పగించారు. అనంతరం సురవరం నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు కుటుంబసభ్యులు అప్పగించారు.
సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్రలో వామపక్ష సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, సీపీఐ జాతీయ నేతలు కే నారాయణ, అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, పల్లా వెంకట్‌రెడ్డి, బీటీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ వద్ద బీఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర సురవరం సుభౌతికకాయానికి పూలమాల వేసి నివాలులర్పించారు.
సురవరం సుధాకర్‌రెడ్డి మరణం పేదలు, బడుగు వర్గాలకు తీరనిలోటని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు ఎదిగి, తుదిశ్వాస వరకు సిద్ధాంతాల అమలు కోసం రాజీలేని పోరాటం జరిపారని కొనియాడారు. పాలమూరు జిల్లాకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు అని పేర్కొన్నారు. త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తానని సురవరంతో తాను ఇటీవలే చెప్పానని, ఇలా కలుస్తానని మాత్రం అనుకోలేదని చెప్పారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి జ్ఞాపకార్థం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సురవరం సుధాకర్‌రెడ్డి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. సుధాకర్‌రెడ్డి మరణం సీపీఐకే కాకుండా సమాజానికి తీరనిలోటని తెలిపారు. మగ్ధూంభవన్‌లో సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని చూసిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నివాళులర్పించిన అనంతరం సురవరంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ సంబంధాలు తమకు ఉన్నాయని చెప్పారు.
సురవరం సుధాకర్‌రెడ్డి సీపీఐలో ఏ పదవిలో ఉన్నా, ఎంపీగా కొనసాగినా ఆ పదవులకే వన్నెతెచ్చారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుదికంటూ నిలబడిన వ్యక్తి సురవం అని పేర్కొన్నారు. ఆయన ఆదర్శాలను నేటి తరం పాటించాలని సూచించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నో ప్రజా ఉద్యమాలను నిర్వహించడంలో సురవరం సుధాకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.
సురవరం లేని లోటు తెలంగాణ ప్రజలకు తీర్చలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నో విప్లవ, కార్మికోద్యమాలతోపాటు తెలంగాణ ఉద్యమంలో చిరస్మరణీయమైన పాత్ర పోషించారని కొనియాడారు. సురవరం మృతి తనను వ్యక్తిగతంగా కలచివేసిందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా సీపీఐ ముందుకు రావడం వెనుక సురవరం పాత్ర కీలకంగా ఉన్నదని తెలిపారు. విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగిన మహోన్నతి వ్యక్తి అని కొనియాడారు. సురవరం మృతికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలుపుతూ, ఆయన కుటుంబసభ్యులకు, సీపీఐకి, ప్రజా ఉద్యమకారులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్టు తెలిపారు.