జహీరాబాద్ : అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి చెందారు. మళ్లీ అధికారంలోకి కేసీఆర్( KCR) రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు (MLA Koninti Manikrao) అన్నారు. 14ఏండ్ల ఉద్యమ చరిత్ర అనంతరం సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలను సుభిక్షంగా ఉంచారని నమస్తే తెలంగాణతో అన్నారు.
ఆరు గ్యారెంటీల పేరిట అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వ పాలనలో మళ్లీ పదేండ్లు వెనకబడి పోయామని ప్రజలు అవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు నిరాశ నిస్పృహతో ఉన్నారు. రుణమాఫీ జరగక, రైతుబంధు రాక రైతులు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.
కల్యాణ లక్ష్మి, తులం బంగారం, మహాలక్ష్మి పేరిటా మహిళలకు ఇస్తామన్న రూ. 2.500 ఇవ్వకపోవడంతో మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజలకు ఇవ్వని హామీలనూ అమలు చేశారని, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, బాలింతలకు కేసీఆర్ కిట్( KCR Kit ) , కల్యాణలక్ష్మి, షాదీముబారక్, హాస్టల్లో చదువుకుంటున్న పేద విద్యార్ధులకు సన్న బియ్యంతో భోజనం అందజేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు కాంగ్రెస్‌పై తిరుగబడుతున్నారని స్పష్టం చేశారు.
తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష
తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని, ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులతో పాటు నాయకులు, అభిమానులు, ప్రజలు స్వచ్చంధంగా తరలివచ్చేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండలాల నుంచి 4 వేల మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఇదివరకే అన్ని మండలాల్లో సమావేశాలను నిర్వహించి దిశానిర్దేశ్యం చేశాం. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి 30 బస్సులు, 100 జీపులతో పాటు 100 ప్రైవేటు వాహనాల్లో పార్టీ శ్రేణులను తరలించేందుకు సిద్ధం చేశామన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం వినడానికి ప్రజలు అసక్తి చూపుతున్నారని వివరించారు.