హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తేతెలంగాణ) : ‘17 నెలల రేవంత్ సర్కారు అరాచక పాలనకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ రెఫరెండమే.. భవిష్యత్తులో ప్రజా తిరుగుబాటుకు ఇదే సంకేతం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రదాత కేసీఆర్‌పై ఉన్న విశ్వాసం, గౌరవానికి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలే నిదర్శమని పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ నేతలు కిశోర్‌గౌడ్, కురువ విజయ్, ఉపేంద్రాచారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన బాహుబలి సభ చరిత్రాత్మకమని అభివర్ణించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన కేసీఆర్‌ను చూసి, ఆయన ప్రసంగం వినేందుకు ప్రజలంతా కదిలిరావడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ సభ కాంగ్రెస్‌కు ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందే ఉన్నదని హెచ్చరించారు.
కేసీఆర్ మీటింగ్‌కు వచ్చిన ప్రజలను చూసి కాంగ్రెస్ పెద్దలు, మంత్రుల కాళ్ల కింద భూమి బద్ధలైందని, వారి వెన్నులో వణుకు పుట్టిందని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. సభలో కేసీఆర్ తన పేరు ఎత్తలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఇంట్లో అన్నం తినకుండా అలిగి పడుకున్నారని వ్యంగ్యా స్త్రం సంధించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమల్లో విఫలమయ్యామని సీఎం, మంత్రులు ఆ త్మవిమర్శ చేసుకోకుండా కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ ఆరోపణలు అవాస్తవమైతే మంత్రులు పొంగులేటి, పొన్నం, సీతక్క జూపల్లి మహా అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. మున్ముందు కాంగ్రెస్ భరతం పడతామని హెచ్చరించారు.