Weather | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ నెలలో సాధారణంగా చలి ఉంటుంది. ఇప్పుడు భిన్నమైన వాతావరణంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఉదయం ఎండలు చంపేస్తుంటే.. సాయంత్రం వర్షం కురుస్తుంది. ఆ వెంటనే చలి తీవ్రత ఉంటుంది. ఇక రాత్రి ఉకపోతతో ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా విరుద్ధమైన వాతావరణంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇలాంటి వాతావరణం గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఉద యం 7 నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం 5 వరకు ఎండ తీవ్రత ఉంటున్నది. ఎండ తీవ్రతతోపాటు ఉకపోత అధికంగా ఉంటుంది. ఈ వేడికి వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.
పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. ఇలాంటి వాతావరణం గత వారం రోజులుగా ఉంటున్నది. 20 నిమిషాలు బయట తిరిగితేనే.. త్వరగా డీహైడ్రేషన్‌కు గురై.. తొందరగా అలిసిపోతున్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఈ పరిస్థితులు అధికంగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ వేడి కారణంగా తాము పని చేసుకోలేకపోతున్నట్టు రైతులు వాపోతున్నారు. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఫ్యాన్లు, ఏసీలు తిరుగుతున్నా ఉకపోత నుంచి ఉపశమనం లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్లోబల్‌వార్మింగ్‌కు తోడు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఈ వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో వారం రోజులు ఈ ఈ తరహా పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు స్పష్టంచేశారు.