హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): భానుడి భగభగలకు రాష్ట్రం అల్లాడిపోతున్నది. పెరిగిన ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి జనం వచ్చేందుకు వణికిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం 27 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయని వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు కూడా ఎండలు మరింత తీవ్రం అవుతాయని హెచ్చరించింది. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో 41.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది.
రాబోయే రోజుల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలని పేర్కొన్నది. ఇదిలా ఉండగా శుక్రవారం ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, నల్లగొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.