హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తేతెలంగాణ) : అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని నిస్సిగ్గుగా చెప్తున్న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అనేకసార్లు మంత్రిగా పనిచేసిన శ్రీహరికి అభివృద్ధి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డంపెట్టుకొని బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్‌లో చేరిన ఆయన తనకు తానే రాజకీయ సమాధి కట్టుకున్నారని దుయ్యబట్టారు. నాడు విద్యాశాఖ మంత్రిగా ఉండి టీచర్ పోస్టులను అమ్ముకున్నారని, విదేశాల్లో అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇల్లు మీద ఇల్లు కట్టుకున్న కడియం.. అవినీతి సామ్రాట్‌గా మారారని నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని గౌరవించి సుప్రీం ఆదేశాల మేరకే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్‌గాంధీ సైతం ఫిరాయింపులపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలే శ్రీహరికి చివరి ఎన్నికలవుతాయని స్పష్టం చేశారు. ఎప్పుడు బరిలో నిలిచినా కర్రుకాల్చి వాతపెట్టేందుకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నమ్మకద్రోహానికి మారుపేరని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ నిప్పులు చెరిగారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యపై అతస్య ఆరోపణలు చేసి కేసీఆర్‌ను నమ్మించి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు. ఆయన తన బిడ్డకు రాజకీయ భవిత కోసమే కాంగ్రెస్‌లో చేరారని దుయ్యబట్టారు. దమ్ము, ధైర్యముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.
కడియం శ్రీహరి తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. కొంతకాలం క్రితం ఏ పార్టీలో చేరలేదని బుకాయించిన ఆయన.. ఇప్పుడు బరితెగించి కాంగ్రెస్‌లో చేరానని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు.