హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): చుట్టూ నీళ్లు.. మధ్యలో ఫాంహౌజ్.. ఐలాండ్‌ను తలపించేలా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి గెస్ట్‌హౌస్ అందరికీ సుపరిచితమే. అది సక్రమ నిర్మాణమేనని ఎమ్మెల్సీ ప్రకటించడం చర్చనీయాంశమైంది. జంట జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల్లో నిర్మాణాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నా కాంగ్రెస్ నేతలు బుకాయిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న బఫర్‌జోన్‌లో తన నిర్మాణం ఉంటే కూల్చుకోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించి ఆపై మౌనవ్రతం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తెరపైకొచ్చారు. హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న గెస్ట్‌హౌస్ దృశ్యాలు చూసి లోకమంతా నివ్వెరపోతుంటే.. ఆయన మాత్రం తాపీగా అంతా సక్రమమేనని ప్రకటించారు.
అన్ని అనుమతులు ఉన్నాయని, కలెక్టర్‌తోపాటు అధికారులు చెప్పిన తర్వాతనే నిర్మించానని మంగళవారం ప్రకటించారు. మరి హైడ్రా కూల్చివేసిన పలు నిర్మాణాలకు కూడా అనుమతులు ఉన్న విషయాన్ని ఎమ్మెల్సీ గుర్తించడం లేదు. రెండు రోజుల కిందట రాయదుర్గంలో కట్టుబట్టలతో మూడు కుటుంబాలను నిర్బంధించి కూల్చివేసిన ఇండ్లు కొన్ని దశాబ్దాలుగా ఆస్తి పన్ను, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. అయినప్పటికీ నిర్దాక్షిణ్యంగా అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారు. అనుమతులు ఉన్నాయా? పన్నులు చెల్లిస్తున్నారా? అని ఆరా తీయడం లేదు. హిమాయత్‌సాగర్‌లో పట్నం మహేందర్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్ భూమి పట్టానే కావచ్చు… కానీ అది ఎఫ్టీఎల్లో ఉందనే వాస్తవం జగమెరిగిన సత్యం. అయినా ఎమ్మెల్సీ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నేనే కూల్చివేస్తానని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా జలమండలి అధికారులు అక్కడికి వచ్చి ఎఫ్టీఎల్ నిర్ధారించకపోవడం శోచనీయం.