నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 16: కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా పార్టీల నాయకులు, వినియోగదారులు ఆందోళనలు చేపట్టారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద సిలిండర్ల కోసం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్యాస్ బుక్ చేసుకున్నా సిలిండర్లు డోర్ డెలివరీ కావడంలేదని, బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని పలువురు ఆరోపించారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వివేకానంద కళాశాల పక్కన ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌బంక్ వద్ద వాహనాలకు తానే పెట్రోల్‌పోసి నిరసన వ్యక్తంచేశారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్‌చౌరస్తాలో సీ పీఐ జిల్లా, నగర కమిటీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో సీపీఐ, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు చేపట్టారు.
పాల్వంచ పట్టణంలో సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మణుగూరులో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్తగూ డెం బస్టాండ్ సెంటర్లో ఆ పార్టీ రాష్ట్ర సమితి నాయకుడు సలిగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
దమ్మపేట సెంటర్లో సీఐటీయూ జిల్లా నాయకుడు రఘు ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజీ వద్ద ఖమ్మం-వరంగల్ హైవేపై వంటగ్యాస్ వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో రాస్తారోకో చేపట్టారు. వెల్దండలో హైదరాబాద్-శ్రీశైలం హైవేపై జరిగిన ఆందోళనలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడారు. సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోపుతూ అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. ధరల పెంపు అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు. ఆత్మనిర్భర్ నినాదం కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదని తేలిపోయిందని దుయ్యబట్టారు. ఇరాన్-ఇజ్రాయెల్ యు ద్ధాన్ని సాకుగా చూపి ధరలు పెంచడం తగదన్నారు.