ఇది ‘నీరో’ సర్కార్!
15 నెలల రేవంత్ పాలనపై ప్రజల్లో విరక్తి ఏర్పడింది. నిర్భయంగా ఇష్టమొచ్చినట్టు తిడుతున్నరు. రేవంత్‌రెడ్డి కనిపిస్తే ప్రజలు కొట్టే పరిస్థితి కనిపిస్తున్నది. 48 గంటల్లోనే రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చికుకొని ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నడు. ఇప్పుడు 36వ సారి ఢిల్లీకి పోయిండు.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కా రు పతనం 15 నెలల్లోపే మొదలైందని, అధికార కాంగ్రెస్ పార్టీని వీడి పెద్దసంఖ్యలో నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి మొన్న, స్టేషన్ఘనపూర్ నియో జకవర్గం నుంచి ఇవాళ భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారని తెలిపారు. 48 గంటల్లోనే ఏడుగురు రైతులు ఆత్మ హత్య చేసుకున్నారని, టన్నెల్లో ఎనిమిది మంది కార్మికులు చికుకొని ఉన్నా, ముఖ్యమంత్రికి పట్టింపు లేకుండా పోయిందని, ఓ వైపు రోమ్ నగరం తగలబడుతుంటే.. మరోవైపు ఫిడేల్ వాయించిన రోమ్ చక్రవర్తి నీరో తరహాలో రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
35 సార్లు ఢిల్లీ వెళ్లినా కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నారని, హోంశాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్థుడైన రేవంత్‌రెడ్డి, తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తాడా? అని ప్రశ్నించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు మలిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, బండారు రవీందర్, సీక రవి, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సుమారు 700 మంది తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 నెలల్లోనే అధికార పార్టీని వదిలి బీఆర్ఎస్లో చేరుతున్నారంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఇది రాష్ట్రంలో బీఆర్ఎస్కు సానుకూల పవనాలకు సంకేతమని తెలిపారు.
రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రశంసించిందని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ 450 రోజుల పాలనలో రోజుకొకరు చొప్పన 450 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. గోదావరి జలాలను 80 మీటర్ల నుంచి 618 మీటర్ల పైకి తీసుకొచ్చి కేసీఆర్ కొండపోచమ్మసాగర్‌ను నింపారని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని నిర్మించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లలో 340 పిల్లర్లు ఉండగా, ఒక పిల్లర్‌కు పర్రెపడితే కాంగ్రెస్ నాయకులు నానాయాగీ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు దున్నపోతు ఈనింది అంటే.. బీజేపీ వాళ్లు దుడ్డెను కట్టేయమన్నట్టు కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి తెలంగాణ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటారని నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాష్ట్రం అప్పులపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారని, అసెంబ్లీలోనే లెక్కలతోసహా గట్టి సమాధానం ఇచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏడాదికి 41 వేల కోట్ల అప్పు చేసి సంక్షోభంలో ఉన్న విద్యుత్తు రంగాన్ని సంసరించామని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చామని తెలిపారు. రైతుబంధు రూపంలో 73 వేల కోట్లలను 70 లక్షల రైతుల ఖాతాల్లో వేశామని, 28 వేల కోట్లతో రెండుసార్లు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశామని, జిల్లాకో మెడికల్ కాలేజీ, వరంగల్‌లో అతిపెద్ద హాస్పిటల్, ఘన్‌పూర్‌లో కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, అతిపెద్ద టెక్స్ టైల్ పార్, 200 ఉన్న గురుకుల పాఠశాలలను 1000కి పెంచామని వివరించారు. సంవత్సరానికి 40 వేల కోట్ల అప్పుతో ఈ కార్యక్రమాలు చేశామని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు చేసి ఒక ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని, కొత్తగా ఒక ఇటుకైనా పేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు రామ్ రామ్ అవుతుందని కేసీఆర్ ముందే చెప్పారని, ఈ లక్షన్నర కోట్ల అప్పుతో ఢిల్లీలో కాంగ్రెస్‌ను నడిపిస్తున్నారని విమర్శించారు.
గతంలో ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకుపోయినా, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా, తాజాగా ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలినా ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడటం లేదని, ఇవాళ రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం పిల్లర్‌కు పర్రెవస్తే హడావుడి చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఈ ప్రమాదాల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదంపై వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద అడిగితే, దేశ భద్రతకు సంబంధించినదని రేవంత్ ప్రభుత్వం చెప్తున్నదని విమర్శించారు.
తెలంగాణలో రాహుల్ – రేవంత్ (ఆర్ఆర్) టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారని, ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా కాంగ్రెస్ సర్కారుపై తీసుకోలేదని మండిపడ్డారు. రూ.2 కోట్ల లాభం మాత్రమే ఆర్జించిన రేవంత్ బామ్మర్దికి చెందిన శోధ కంపెనీకి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టును రేవంత్‌రెడ్డి అక్రమంగా కట్టబెట్టారని, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఆరు నెలలైనా చర్యలు లేవని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరిగినా, ఇప్పటిదాకా ఏం జరిగిందో ఈడీ బయటపెట్టలేదని విమర్శించారు. తెల్లారి లేస్తే కేసీఆర్‌ను విమర్శించే రేవంత్‌రెడ్డి, బీజేపీని ఒక్క మాట కూడా అనడని, బీఆర్ఎస్, కేసీఆర్ ఉన్నంత వరకు తమ పప్పులు ఉడకవని కాంగ్రెస్, బీజేపీలు కమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.
రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించడం కేసీఆర్ పాలనాదక్షత, రైతులపై ఉన్న ప్రేమకు నిదర్శనం. కానీ, కాంగ్రెస్ 450 రోజుల పాలనలో రోజుకొకరు చొప్పన ఇప్పటివరకు 450 మంది రైతులు చనిపోయిండ్రు. ఇదీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా.
– కేటీఆర్
అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఉచిత బస్సు మినహా ఏవీ అమలుచేయకపోవడంతో ప్రజలు ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారని కేటీఆర్ దెప్పిపొడిచారు. ఎవరికీ భయపడకుండా దుమ్మెత్తి పోస్తున్నారని, ఏ యూట్యూబ్ చానల్ చూసినా ఇట్లనే కనిపిస్తున్నదని చెప్పారు. రేవంత్‌రెడ్డి కనిపిస్తే కొట్టే పరిస్థితి ప్రజల్లో కనిపిస్తున్నదని తెలిపారు. ‘కాంగ్రెస్ పాలన అంటే ఏంటో ఇప్పుడిప్పుడే మనోళ్లకు అర్థమవుతున్నది. కాంగ్రెస్ పాలనపై మహిళలను పలుకరిస్తే చాలు.. తిట్టకూడని తిట్లతో రేవంత్‌ను ఉతికి ఆరేస్తున్నారు. నిజంగా చెప్తున్న.. మీరు నమ్ముతరో లేదో తెలియదు కానీ.. తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటయని నాకు తెల్వది.. అరెరె.. ఏం తిట్టుడు అయ్యా అది. భయం లేదు, భక్తి లేదు గొట్టం పెట్టుడే ఆలస్యం..పొట్టుపొట్టు తిడుతున్నరు’ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు.
లగచర్లలో తన అల్లుడి ఫ్యాక్టరీకి భూములు ఇవ్వనందుకే అకడి రైతులపై రేవంత్ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని, లగచర్ల లంబాడ సోదరుల కోసం ఢిల్లీ వరకు వెళ్లి కొట్లాడి బెయిల్ తెప్పించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడతామంటూ కొడంగల్ నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైందన్నారు. అది స్టేషన్ఘనపూర్ కూడా పాకిందని చెప్పారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, అకడ బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
కుండపగిలినా కుక్క బుద్ధి తెలిసినట్టుగా రేవంత్‌ను చూసిన తర్వాతే కేసీఆర్ విలువ ప్రజలకు అర్థమవుతున్నదని, బీఆర్ఎస్కు ఓటు వేయనందుకు బాధపడుతున్నారని తెలిపారు. ‘గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది.. మోసపోయామని ప్రజలకు కూడా అర్థమైంది. రుణమాఫీ లేదు, రైతుబంధు, కల్యాణ లక్ష్మి లేదు. రైతులకు టకీటకీమని డబ్బులు పడడం లేదు కాని.. టకీటకీమని ఢిల్లీలో మాత్రం మోగుతున్నది.. ఎందుకంటే పదవిని కాపాడుకోవాలె కాబట్టి. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వద్ద దోచుకొని ఢిల్లీలో అప్పజెప్తుండు. ఢిల్లీలో ఉండే రాహుల్‌గాంధీకి మాత్రం రేవంత్ టకీటకీమని పైసలు పంపుతున్నడు’ అని కేటీఆర్ విమర్శించారు.
ఇటీవలే తాను లగచర్ల వెళ్లానని, 30 వేల మందికిపైగా తరలివచ్చారని, రేవంత్‌రెడ్డిని తరిమికొడుతామని హెచ్చరించినట్టు కేటీఆర్ చెప్పారు. ‘సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే రేవంత్‌రెడ్డికి దికులేదు.. మీ కడియం శ్రీహరి ఉంటడా? తెల్లారిలేస్తే నీతులు మాట్లాడుతడు.. ప్రపంచంలో తన కంటే మేధావి ఎవరూ లేరన్నట్టు ప్రవర్తిస్తున్నడు.. నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి.. ఏమన్న ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రా.. దమ్ముంటే రా.. అని భీకరమైన డైలాగులు ఎందుకు.. నిజంగా నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందనుకుంటే రాజీనామా చెయ్యి.. ఉప ఎన్నికకు రా. సుప్రీం కోర్టులో కొట్లాడుతున్నాం.. న్యాయం జరుగుతది.. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. బరాబర్ కొట్లాడాలె.. వీళ్ల సంగతేందే తేల్చాలె’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
స్టేషన్‌ఘనపూర్‌లో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ అద్భుతంగా పనిచేస్తున్నదని కేటీఆర్ ప్రశంసించారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు చేపడుదామని చెప్పారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలవారీగా కొత్త కమిటీ వేసుకుందామని, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసుకుందామని తెలిపారు. పార్టీ రజతోత్సవ సంబురాలను ఘనంగా జరుపుకొందామని ప్రకటించారు. ప్రభుత్వంపై పోరాడుదామని, ప్రజా ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు.
స్వల్పకాలంలోనే అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష బీఆర్ఎస్లో చేరుతున్నారంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇది రాష్ట్రంలో బీఆర్ఎస్ సానుకూల పవనాలకు సంకేతం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా ఫరక్ లేదని రేవంత్ చిద్విలాసంగా మాట్లాడుతున్నడు. అసలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తాను సీఎం అవుతానని రేవంత్ కలలో కూడా ఊహించి ఉండడు. లక్కీలాటరీలో సీఎం అయిండు.
– కేటీఆర్
తెలంగాణలో దుర్మార్గపు పాలన సాగుతున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. 15 నెలల రేవంత్ పాలనలో ప్రజల ఛీత్కారాలు, హాహాకారాలు చూస్తున్నామని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో ఇద్దరు ద్రోహులు, దుర్మార్గులు ఉన్నారని, ఒకరు రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు కడియం శ్రీహరి అని విమర్శించారు. శ్రీహరిని బీఆర్ఎస్ అక్కున చేర్చుకోకపోతే రాజకీయంగా సమాధి అయ్యేవారని మండిపడ్డారు. బీఆర్ఎస్లో చేరి రాజకీయ పునర్జీవం పొందారని, అనేక పదవులు అనుభవించి పార్టీ మారారని విమర్శించారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పార్టీకి మూలస్తంభంగా ఉండి ద్రోహ పార్టీలకు, ద్రోహ వ్యక్తులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
వెన్నుపోటు, ద్రోహానికి మారుపేరు కడియం శ్రీహరి అని బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య విమర్శించారు. బీఆర్ఎస్లో అనేక పదవులు అనుభవించి పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమనే నమ్మకంతో స్టేషన్‌ఘనపూర్‌కు చెందిన సుమారు 700 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. అధికార కాంగ్రెస్‌ను వదిలి తెలంగాణ అస్తిత్వం, అభివృద్ధి కోసం గులాబీ కండువా కప్పుకున్నారని తెలిపారు. కడియం శ్రీహరి కొందరిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని, అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలకు తమ పార్టీ నేతలు భయపడబోరని హెచ్చరించారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే స్టేషన్‌ఘనపూర్‌లో శ్రీహరికి డిపాజిట్ రాకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పాలని కోరారు.