హైదరాబాద్, జనవరి 10(నమస్తే తెలంగాణ) : ఇంట్లో నల్లా పనిచేయకపోతే అదే రోజు బిగించేస్తాం. తలుపులు, కిటికీలు విరిగిపోతే తెల్లవారే మరమ్మతులు చేయించుకుంటాం. కానీ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఏ వస్తువువైనా దెబ్బతింటే.. మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా నల్లా కనెక్షన్లు, టాయిలెట్లు, తరగతి గదుల్లో రిపేర్లకు నిధుల్లేకపోవడమే ఇందుకు కారణం. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సివిల్ వర్క్స్‌కు ఏటా రూ.100 నుంచి రూ.300కోట్లు కేటాయించేవారు. కొంతకాలంగా సివిల్ వర్క్స్‌కు కేంద్రం బడ్జెట్ ఇవ్వడం లేదు.
ఇచ్చేవి కూడా సిబ్బంది వేతనాలు, డైట్చార్జీలకే సరిపోతున్నాయి. ప్రతి నెలా కేజీబీవీ, సమగ్రశిక్షా సిబ్బందికి వేతనాలకు రూ.35 కోట్లు, కేజీబీవీ డైట్ చార్జీలకు రూ.20 కోట్ల అవసరం. వీటి చెల్లింపులకే విద్యాశాఖ ఆపసోపాలు పడాల్సి వస్తున్నది. కొన్నిసార్లు జీతాలు కూడా ఆలస్యమవుతున్నాయి. నిధుల్లేక కొన్ని పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, బాలబాలికలకు వేర్వేరుగా టాయ్లెట్ల నిర్మాణం, తాగునీటి వసతి, ఆఫీస్, తరగతి గదుల్లో మేజర్, మైనర్ రిపేర్లు చేయలేకపోతున్నారు. పనులకు రూ.4వేల కోట్లు అవసరమని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. విడుతల వారీగా ఇవ్వాలని, వచ్చే బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నది.
13.77శాతం బడుల్లో బాలురకు టాయిలెట్లు లేవు. 4.5 శాతం బడుల్లో అమ్మాయిలకు టాయిలెట్లు లేవు. 52 బడుల్లో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. విద్యుత్తు కనెక్షన్లు లేని బడులు 413 ఉన్నాయి. ప్రహరీ గోడల్లేక 5,990 బడులకు రక్షణ కరువయ్యింది. కొన్ని బడులైతే పశువులు, పందులు, మద్యం ప్రియులకు అడ్డాగా మారాయి. రక్షణ లేక ల్యాబ్, కంప్యూటర్ ఉపకరణాలు చోరీకి గురవుతున్నాయి. మరో 3,745 బడుల్లో ర్యాంపుల్లేవు. ఏకంగా 4,505 స్కూళ్లల్లో ఆట స్థలాల్లేవు. 8,050 బడుల్లో కిచెన్షెడ్లు లేవు. సర్కార్ నిధులిస్తేనే సివిల్ వర్క్స్ చేపట్టాలన్న ఆలోచనలో అధికారులున్నారు.