Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి. జీపీఎఫ్, లీవ్ సరెండర్, లీవ్ ఎన్క్యాష్మెంట్, ఆర్జిత సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటి బిల్లులు కలిపి మొత్తం రూ.8 వేల కోట్లు పెండింగ్లో ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇవి కాకుండా సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన మరో రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు 10%, యూపీఎస్ ఉద్యోగులకు 14% వాటాను కూడా చెల్లించడంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3.6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరంతా పెండింగ్ బిల్లుల బాధితులే. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జిల్లా పరిషత్ టీచర్ల జీపీఎఫ్ రూపాయి కూడా విడుదల కాలేదు. గతంలో పెండింగ్ బిల్లులను ట్రెజరీలో సమర్పించిన 24 గంటల్లోనే ఆ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యేది. కానీ, ఇప్పుడు కండ్లు కాయలు కాసేలా వేచిచూడాల్సి వస్తున్నది.
పెండింగ్లో పెట్టి.. ఆపై తిరస్కరించి..
ఉద్యోగుల బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టడమే కాకుండా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియగానే వాటిని తిరస్కరిస్తున్నది. దీంతో ఉద్యోగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని బిల్లులను ఏండ్ల తరబడి ట్రెజరీల్లో పెండింగ్లో పెట్టి, ఏడాది తర్వాత మళ్లీ రీవ్యాలిడేషన్ చేయించుకురమ్మంటున్నారు. దీంతో అసలే బిల్లులు రాక అవస్థలు పడుతున్న ఉద్యోగులు రీవ్యాలిడేషన్తోపాటు కొత్త ప్రొసీడింగ్ కోసం మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. అయినప్పటికీ ‘గతంలోనే ఇచ్చాం కదా.. ఇప్పుడు మళ్లీ ఏమిటి?’ అంటూ అధికారులు చిర్రుబుర్రులాడుతున్నారు. ఓ టీచర్ ఈఎల్ సరెండర్ బిల్లులు సమర్పించగా ఇంతవరకు మంజూరుకాలేదు. ఆర్థిక సంవత్సరం 2024 మార్చిలో ముగియడంతో కొత్త బిల్లు రీసబ్మిట్ చేయాలని సూచించారు. కొత్త బిల్లు సమర్పించిన తర్వాత కూడా పెండింగ్లోనే పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) వచ్చే నెలాఖరుతో ముగియనున్నది. అప్పటిలోగా ఈ బిల్లు మంజూరు కాకపోతే దాని గడువు ముగిసినట్టే. ఆ బిల్లు కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీంతో సర్కారు తప్పిదాలకు ఉద్యోగులను బలిచేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఉద్యోగుల ఆగ్రహం
పెండింగ్ బిల్లులు మంజూరు కాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. పాత బిల్లుల గడువు ముగియడంతో మళ్లీ కొత్తగా బిల్లులు సమర్పించాల్సి రావడం, కొన్ని శాఖల్లో రీవ్యాలిడేషన్ చేయించాలనడం చిన్న ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడంతో ఉద్యోగ సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 12 తర్వాత పోరుబాట పట్టేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ సిద్ధమవుతున్నది.
ఉద్యోగుల అగచాట్లు ఇవీ..
ఓ ఉద్యోగి 2023 ఫిబ్రవరి 8న సమర్పించిన 30 రోజుల సరెండర్ లీవుల బిల్లు రూ.1,03,864 మొత్తానికి ఆ ఏడాది మార్చి 31న ఓసారి, నిరుడు మార్చి 31న మరోసారి రీటోకెన్ అయ్యింది. కానీ, ఇప్పటివరకు ఆ బిల్లు జారీకాలేదు. ఇప్పుడు 2025 మార్చి 31 సమీపిస్తున్నప్పటికీ ఆ బిల్లు పెండింగ్లో ఉన్నది. అంటే.. కనీసం లక్ష రూపాయల బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేక రెండేండ్లు పెండింగ్లో పెట్టింది.