హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులను జూన్ 30లోగా చెల్లించాలని, లేని పక్షంలో ధర్నా చౌక్ వద్ద లక్ష మంది పాడిరైతులతో ఆందోళన చేపడుతామని విజయ డెయిరీ పాడిరైతుల సంక్షేమ పరిరక్షణ సమితి ప్రతినిధులు హెచ్చరించారు. సోమవారం సమితి అధ్యక్షుడు ఇరుకు దేవేందర్ రావు, ప్రధాన కార్యదర్శి గనప లక్ష్మిరెడ్డి నేతృత్వంలో విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, ఎండీలకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం దేవేందర్ రావు, లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ విజయ డెయిరీ సేకరించే పాలకు సక్రమంగా బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడం వల్ల పాడి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి, పాలు
విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో కల్తీ పాలు, నెయ్యి అమ్ముతున్నారని గుత్తా అమిత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తనను కలిసిన పాడి రైతులతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజ్ ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.