హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : ‘ఉద్యోగుల పెండింగ్ బిల్లులు బాకీపడ్డ మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు. అప్పులకు వడ్డీలు కట్టేందుకే పైసల్లేవు. మొత్తం పెండింగ్ బిల్లులను ఒకే సారి విడుదల చేయలేం. వాయిదా పద్ధతిలో నెలకు రూ. 700 కోట్ల చొప్పున విడుదల చేస్తాం. ఇలా ఏడాదిలోపు పెండింగ్ బిల్లులను మొత్తం క్లియర్చేస్తాం. ఏడాది తర్వాత పెండింగ్ బిల్లులనేవే ఉండవు. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు చెల్లిస్తూ పోతాం’ ఇది ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు సర్కారు పెద్దలిచ్చిన హామీ. సాక్షాత్తు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే ఈ ఏడాది మార్చిలో ఈ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. ఈ నాలుగు నెలల్లో దాదాపు రూ. 2,800కోట్ల బిల్లులను క్లియర్ చేయాల్సి ఉండగా, సర్కారు ఇంతవరకు రూపాయి విడుదల చేయలేదు.
9వేల కోట్లపైనే పెండింగ్
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులే రూ. 9వేల కోట్లున్నాయి. ప్రతి నెలా వందల కోట్లు అదనంగా వచ్చి చేరుతున్నాయి. మార్చి వరకు 7వేల కోట్లుండగా, జూలైకి మొత్తం రూ. 9వేల కోట్లయ్యింది. జీపీఎఫ్, రిటైర్మెంట్ బిల్లులింకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగులకు జీతాలు తప్ప ఏ ప్రయోజనాలు అందడంలేదు. పాతవే పెండింగ్‌లో ఉన్నాయంటే కొత్తవి కూడా ఇవ్వడంలేదు. వందలాది మంది ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం హైకోర్టును ఆశ్రయించారు. కొంత కాలం క్రితం 180 కోట్ల మెడికల్ బిల్లులను మాత్రమే విడుదల చేశారు. మిగతావి పక్కనపెట్టేశారు. అసలు హామీని అటకెక్కించారు. దీంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ‘పాత పీఆర్సీ గడువు ముగిసి జూలై ఒకటికి రెండేండ్లు దాటింది. కమిటీ రిపోర్ట్‌ను కూడా తెప్పించుకోకపోతే ఎట్లా..? ఇక పీఆర్సీ కమిటీ చైర్పర్సన్ ఎందుకింకా రిపోర్ట్‌ను సమర్పించడంలేదు..?’ అంటూ ఉద్యోగుల సమస్యలపై వేసిన ఐఏఎస్ అధికారుల కమిటీని కూడా ప్రశ్నిస్తున్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటే, ఇప్పుడు ఇచ్చి, మూడు డీఏలను పీఆర్సీలో కలుపమన్నాం. పరిష్కారాలు కూడా మేమే చూపిస్తున్నప్పుడు సాచివేత ఎందుకని జేఏసీ నేతలంటున్నారు.
పనిచేయమంటరా.. వద్దంటరా..?
ఉద్యోగులను పనిచేయమంటరా.. వద్దంటారా..? అంటూ ఓ జేఏసీ నేత సర్కారును ప్రశ్నించారు. ‘మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నరు. మేం కూడా ఏం పనిచేయం. మాకు కూడా ఉచితాలివ్వండి. కూర్చుండి తింటాం. మమ్మల్ని కూడా కోటీశ్వరులను చేయండి.’ అంటూ సర్కారునుద్దేశించి సదరు నేత వ్యాఖ్యానించారు. ‘సీఎం, మంత్రుల అకౌంట్లో డబ్బులను మేం తీసుకుంటే ఊరుకుంటారా..? మరీ మా అకౌంట్లలో డబ్బులు తీసుకుంటే మేమేందుకు ఊరుకోవాలి’ అంటూ నిలదీశారు. ‘ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు. మా ఓపికను చేతగానితనంగా భావిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి’ అని మరో జేఏసీ నేత హెచ్చరించారు. ‘ఒక డీఏ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. హెల్త్కార్డులిస్తామన్నారు. విధివిధానాలు రూపొందిస్తామన్నారు. దీని మీద ఒక్క మీటింగ్ పెట్టలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏం ప్రయోజనం. అప్పులు.. ఆర్థిక సంక్షోభమని ఇంకెంతకాలం నెట్టుకొస్తారు. ఎంతకాలం తప్పించుకుంటారు’ అని ఇంకో జేఏసీ నేత విమర్శించారు. ‘దగా పడ్డ ఉద్యోగులారా.. దండుకట్టండి’ అంటూ మరో నేత పిలుపునిచ్చారు.
ఉచితాలిచ్చేందుకు ఉద్యోగుల డబ్బులే దొరికాయా?
డీఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ అడగడమే పాపమన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మేం ఏదీ అడగొద్దు అన్నట్టుగా సర్కారు తీరు ఉన్నది అంటూ మరో జేఏసీ నేత ఫైర్ అయ్యారు. ‘ఆగండి.. కొద్ది రోజులు ఓపికపట్టమన్నారు. 17 నెలలవుతున్నది. ఇంకా ఎన్ని రోజులు ఆగాలి. ఉచితాలిచ్చేందుకు డబ్బులుంటాయి. కానీ న్యాయంగా మాకు ఇవ్వాల్సినవి ఇచ్చేందుకు డబ్బులుండవా..? ఉచితాలిచ్చేందుకు ఉద్యోగుల డబ్బులే దొరికాయా..? ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో ఉద్యోగుల జీతం దేనికి చాలడంలేదు. రోగాలొస్తే లక్షలకు లక్షలు ఖర్చవుతున్నాయి. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కుప్పలు.. తెప్పలు పెండింగ్‌లో ఉన్నాయి. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ జీవో-186పై చర్చించిన నాథుడులేడు.. ఇంకెన్నిరోజులు వేచిచూడాలి’ అంటూ తన ఆవేదనను వ్యక్తంచేశారు.
‘17 నెలల్లో రెండు డీఏలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మేం అడిగినవి ఏ ఒక్కటి పరిష్కారంకాలేదు. మేం గొంతెమ్మ కోర్కెలు కోరడంలేదు. మాకు న్యాయంగా దక్కాల్సినవే అడుగుతున్నాం. మ్యానిఫెస్టోలో పెట్టినవే ఇవ్వమంటున్నాం. మ్యానిఫెస్ట్టోలో పెట్టినప్పుడు తెలియదా..?’ అంటూ మరో నేత ఫైర్ అయ్యారు. ‘మార్పు.. మార్పు అంటే ఏం మార్పులేదు. ఉచిత పథకాలు ఇచ్చి డబ్బులన్నీ వృథా చేస్తున్నారు. ఓటు బ్యాంకు పెంచుకుంటున్నరు. ఈ ఉచితాలను అర్హులకిస్తున్నారా..? అంటే అది లేదు. అనర్హలకిచ్చి కోట్లకు కోట్లు వృథా చేస్తున్నారు. అసలు మిమ్మల్ని ఉచిత పథకాలివ్వమన్నదెవరు. జీతాలు, డీఏలు, పీఆర్సీలకేమో పైసలుండవు. కానీ ఉచితాలకు డబ్బులుంటాయా..? ధరలు పెరుగుతున్నాయి. పెన్షనర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. మేం దాచుకున్న డబ్బులు మాకిచ్చేందుకు కూడా ఇంత రాద్ధాంతమా..? అయినా సర్కారు పెద్దలు, మంత్రులు విలాసవంతమైన జీవితం గడపడంలేదా..? మంత్రులు హెలిక్యాప్టర్లలో తిరగడంలేదా..?’ అంటూ సదరు జేఏసీ నేత నిలదీశారు.
నేడు జేఏసీ సమావేశం
తాజా పరిణామాల నేపథ్యంలో రెండు వందలకుపైగా సంఘాలతో కూడిన ఎంప్లాయిస్ జేఏసీ కీలక సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరగనున్నది. ఉద్యోగుల సమస్యలపై సర్కారు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఎజెండాగా సమావేశం సాగనున్నది. పెండింగ్ బిల్లులు, ఈహెచ్ఎస్, పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఆఫీసర్స్ కమిటీ పరిష్కారాలు, సస్పెండ్‌చేసిన ఉద్యోగుల సమస్యతోపాటు జేఏసీ సర్కారు ముందుంచిన 57 డిమాండ్లు, 200కు పైగా సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండటం, 17 నెలలుగా పరిష్కారం కాకపోవడంపై చర్చ జరగనున్నది. ఇంతకాలం వేచిచూసినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందని, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగులు తమను నిలదీస్తున్నారని, తాము ఓపిక పట్టే పరిస్థితుల్లో లేమని ప్రకటించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తామని, అందరి అభిప్రాయం తీసుకుని కార్యాచరణ రూపొందిస్తామని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు.