హనుమకొండ, మే 21: ధాన్యం కొనుగోలు, సన్న బియ్యం టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్‌తో కలిసి హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హత లేకపోయినా వేల కోట్ల ధాన్యం టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు, మధ్యాహ్నం భోజనం సన్న బియ్యం టెండర్లలో కాంగ్రెస్ పార్టీ, సీఎం, మంత్రులు చేతివాటాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపించినా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదంటే తప్పకుండా ఇందులో వారి ప్రమేయం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నదని తెలిపారు.
గ్లోబల్ టెండర్ పేరుతో కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లను 2025 మార్చి వరకు బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కేంద్రీయ బండార్ సంస్థకు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థకు టెండర్ ఇచ్చారంటేనే పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు స్పష్టం అవుతున్నదని అన్నారు.
ఇందులో గల్లీ నుంచి ఢిల్లీ వరకు వాటాలు వెళ్లాయని ఆరోపించారు. ఈ కుంభకోణం విషయాన్ని గురువారం సీఎస్‌కు, సివిల్ సప్లయీస్ కమిషనర్, డీఐజీ, ఐజీలు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. రవీందర్‌సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ టెండర్ల పేరుతో సుమారు రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అనర్హులకు ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలని, సివిల్ సప్లయీస్‌లో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.