హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్లా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి ఉన్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో పలు అంశాలపై మాట్లాడారు. చంద్రబాబు సహా బీజేపీతో రేవంత్‌రెడ్డి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడని విమర్శించారు. అందుకే బనకచర్లపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాడు ఉద్యమాన్ని తాకట్టు పెట్టినట్టే, నేడు తెలంగాణ రైతుల ప్రయోజనాలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని విమర్శించారు. రేవంత్ నోరు తెరిస్తే అబద్ధాలు, అసత్యాలు, బూతులతోనే పబ్బం గడుపుతున్నాడని, ఆయనకు రాష్ట్రంపై సరైన పరిజ్ఞానమే లేదని తేల్చిచెప్పారు. గురుదక్షిణ కోసం తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టడానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు.
అందులో భాగంగానే గోదావరి నీళ్లను ఏపీకి అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతున్నాడని విమర్శించారు. సీఎం వైఖరి ఏపీ ప్రభుత్వానికి సరెండర్ అయినట్టుగానే ఉన్నదని ధ్వజమెత్తారు. బనకచర్ల అంశంలో తప్పు చేసిన రేవంత్.. దానిని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, హరీశ్‌రావుపై ఆరోపణలు గుప్పిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు చంద్రబాబు బనకచర్లపై వేగంగా అడుగులేస్తుంటే.. దానిపై పోరాడాల్సింది పోయి చర్చలంటూ దాటవేత ధోరణిని అవలంబిస్తున్నాడని అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారిచ్చేందుకు ఉద్యమకారులపైకి నాడు రైఫిల్ ఎకుపెట్టిన రేవంత్‌రెడ్డి, నేడు అదే ధోరణితో తెలంగాణ నీళ్లను చంద్రబాబుకు అప్పజెప్పాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడైనా, నేడైనా చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి చెంచాగిరి చేయడమే ఎజెండాగా పెట్టుకున్నాడని విమర్శించారు.