హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రైస్‌మిల్లుల్లోని ధాన్యం తరలించేందుకు టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లు విఫలమైనందున ఈఎండీ మొత్తాన్ని జప్తు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పౌరసరఫరాలశాఖ అధికారులు సెంట్రల్ నిబంధనలకు విరుద్ధంగా కొంత మొత్తాన్నే మాత్రమే జప్తు చేసి.. ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రూ.385 కోట్లల్లో రూ.60 కోట్లను స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు లేఖ రాశారు. నిబంధనల ప్రకారం టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లు 90రోజుల్లో ధాన్యం ఎత్తాల్సి ఉంటుందని ప్రస్తావించారు.
కానీ గడువు ముగిసి 475 రోజులైనా ధాన్యాన్ని తరలించకపోవడంతో ప్రజాధనానికి గండిపడుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు వేలకోట్ల నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అసెంబ్లీలో లెవనెత్తినా.. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకున్నదని గుర్తుచేశారు.