హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : ధాన్యం టెండర్ల స్కాంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష హస్తం ఉన్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆ శాఖ కమిషనర్ పాత్రధారులని స్పష్టంచేశారు. 17 నెలల కిందట పార్క్ హయత్ హోటల్లో ఈ కుంభకోణానికి బీజం పడిందని బట్టబయలు చేశారు. ఈ స్కాంలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు సైతం ముడుపులు ముట్టాయని చెప్పారు. ఈ గోల్‌మాల్‌పై బీజేపీ నేతలు నోరెత్తక పోవడం అనుమానాలు కలిగిస్తున్నదని విమర్శించారు. ధాన్యం టెండర్లలో అక్రమాలపై తాము వేసిన పిల్‌పై విచారణ సమయంలో హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని 17 సార్లు అడిగినా వాయిదాలు కోరుతూ తప్పించుకుంటున్నదని ధ్వజమెత్తారు. హరీశ్‌రావు అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్పకుండా దాటవేసిందని దుయ్యబట్టారు. ప్రతి చిన్న అంశానికీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ నాయకులు.. తాము తొమ్మిదిసార్లు ప్రెస్మీట్లు పెట్టినా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
‘కోర్టులో కౌంటర్ వేయకుండా, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరించడం చూస్తే కాంగ్రెస్ నేతలే దొంగలన్న విషయం తెలిసిపోతున్నది. దండుపాళ్యం ముఠా తెలంగాణను విచ్ఛలవిడిగా దోచుకుంటున్నది’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ దోపిడీని బట్టబయలు చేసినం.. దొంగలకు శిక్షపడేదాకా వదిలిపెట్టేది లేదు’ అని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వాసుదేవారెడ్డి, సతీశ్‌రెడ్డి, పార్టీ నేత బొమ్మెర రామ్మూర్తితో కలిసి విలేకరులతో గంగుల మాట్లాడుతూ రైస్‌మిల్లుల్లో పేరుకుపోయిన 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం 2024 డిసెంబర్లో గ్లోబల్ టెండర్లు పిలిచిందని చెప్పారు. టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలు 90 రోజుల్లోగా తరలించాల్సి ఉండగా నిర్లక్ష్యం చేయడంతో ఖజానాకు రూ.7,650 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. వడ్ల బస్తాలను ఎత్తాల్సిన ఏజెన్సీలు బస్తాల్లో పైసలు ఎత్తాయని విమర్శించారు. తమ వద్ద ఉన్న ధాన్యాన్ని తరలించాలని మిల్లర్లు మొత్తుకున్నా పట్టించుకోకుండా అప్రజాస్వామికంగా వారి మెడపై కత్తిపెట్టి క్వింటాల్‌కు రూ. 2030 చొప్పున ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలంతా పాలుపంచుకున్నారని తెలిపారు. మిల్లర్లలో ఉన్న ధాన్యాన్ని చూసుకొనే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు తమ ఈఎండీని వాపస్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని, ప్రభుత్వ పెద్దలు సైతం ఇందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. గడువులోగా ధాన్యం తరలించని కాంట్రాక్టర్లపై కేసులు పెట్టాల్సిన ప్రభుత్వం వారికి వంతపాడడం సిగ్గుచేటని దుయ్యబ ట్టారు. కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ పెద్దల వైఖరితో వడ్డీ రూపంలో రూ. 700 కోట్ల నష్టం జరి గిందని, దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అవినీతిపై ఈ రోజూ ఈడీకి ఫిర్యాదు చేశామని, ఏసీబీ, సీబీఐ, డీఆర్ఐ, ఎఫ్‌సీఐ, సెంట్రల్ విజిలెన్స్‌కు సైతం కాంప్లెంట్ చేస్తామని స్పష్టం చేశారు. చిటికిమాటికీ తమ పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై విచారణకు ముందుకొచ్చే ఏసీబీ అధికారులు ధాన్యం టెండర్లలో గోల్ మాల్‌పై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ నేతల అవినీతిపై విచారణ జరిపించాలని, ప్రభుత్వం కూడా దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ వదిలిపెట్టబోదని తేల్చిచెప్పారు. దర్యాప్తు ఏజెన్సీల తలుపుతడతామని, కోర్టులో, క్షేత్రస్థాయిలో పోరాడుతామని స్పష్టంచేశారు.
ధాన్యం టెండర్లలో వేలకోట్ల గోల్మాల్ జరుగుతుంటే కేంద్రంలోని బీజేపీ ఎందుకు స్పందించడం లేదని గంగుల ప్రశ్నించారు. బీఆర్ఎస్పై ఎగిరెగిరి పడే నేతలు కాంగ్రెస్ దోపిడీకి వంతపాడటం దురదృష్టకరమని, ఇప్పటికైనా మౌనం వీడి కుంభకోణంపై విచారణకు కేంద్ర ఏజెన్సీలను డిమాండ్ చేయాలని కోరారు. లేదంటే ఈ అవినీతిలో వారి పాత్ర కూడా ఉన్నదని అనుమానించాల్సి వస్తుందని స్పష్టంచేశారు.
ధాన్యం టెండర్లలో గోల్‌మాల్‌పై హైకోర్టులో వేసిన పిల్‌పై విచారణ సందర్భంలో 17 సార్లు చీఫ్ జస్టిస్ కౌంటర్ దాఖలు చేయాలని అడిగితే ప్రభుత్వం వాయిదాలతో తప్పించుకున్నదని పెద్ది సుదర్శన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ‘ధాన్యం కుంభకోణంపై ఇప్పటికీ మేం తొమ్మిదిసార్లు ప్రెస్‌మీట్ పెట్టినా ఏ ఒక్క కాంగ్రెస్ నేత స్పందించలేదు..కేటీఆర్ విలేకరుల సమావేశం పెట్టి బట్టబయలు చేసినా సమాధానం ఇవ్వలేదు. కాంగ్రెస్ దొంగ కాకుంటే, దండు పాళ్యం ముఠా కాకుంటే 17 సార్లు అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు తప్పించుకుంటున్నరు?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వమే 17 సార్లు వాయిదా కోరినా చరిత్రలో ఇప్పటివరకు ఉన్నాదా? అని నిలదీశారు. ‘ఈ పిల్‌పై విచారణ చేపట్టిన ముగ్గురు చీఫ్ జస్టిస్‌లు మారారు. కానీ ప్రభుత్వం మాత్రం కౌంటర్ వేయలేదు. సర్కారు తీరు చూస్తుంటేనే కాంగ్రెస్ దొంగ..420 అనే విషయం తెలిసిపోతున్నది.
ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ ప్రత్యక్ష పాత్ర ఉన్నది’ అని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పెద్దలు తప్పించుకుంటున్నందునే ఈ రోజు 715 పేజీలతో కూడిన ఆధారాలను ఈడీకి సమర్పించామని, ఏసీబీ, ఈడీఐ, సీబీఐ, విజిలెన్స్ దర్యాప్తు ఏజెన్సీలతో పాటు ఎఫ్‌సీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంతో సంబంధమున్న ఎఫ్‌సీఐని కూడా కోర్టులోకి లాగామని చెప్పారు. ‘ఇక్కడి బీజేపీ నేతలు మొదట హడావుడి చేసి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?’ అని ప్రశ్నించారు. ‘ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణ భవన్లో తొమ్మిదిసార్లు ప్రెస్‌మీట్ పెట్టినం. కానీ కాంగ్రెస్ నుంచి స్పందనలేదు..పొద్దున లేస్తే కేసీఆర్, కేటీఆర్‌లపై మొరిగే ఆ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? కోర్టుకు పోతే ఎందుకు తప్పించుకుంటున్నరు? ఆ పార్టీలో ఒక్క రోషమున్నోడూ లేడా?’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లు చేసే చిల్లర రాజకీయాలతో 70 లక్షల మంది రైతులకు భరోసానిచ్చే సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌ను నిండా ముంచుతున్నారని నిప్పులు చెరిగారు. రూ. 423 కోట్ల విలువైన అదనపు వసూళ్ల వివరాలను ఖాతాలతో సహ సేకరించి ఈడీకి సమర్పించామని చెప్పారు. దొంగలు దొరికేదాకా, దోషులకు శిక్ష పడేదాకా పోరాడుతామని తేల్చిచెప్పారు.
సివిల్ సప్లయ్ స్కాంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. 715 పేజీలతో కూడిన పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వీరి వెంట ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వాసుదేవారెడ్డి, సతీశ్‌రెడ్డి ఉన్నారు.