నర్సంపేట, ఫిబ్రవరి 24: మిర్చి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో మిర్చి ధరలు భారీగా పడిపోతున్నాయని, మార్కెట్ ధరతో పాటు రైతులకు అదనంగా క్వింటాల్‌కు రూ.10వేలు అందించాలని డిమాండ్‌చేశారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిర్చి రైతుల విషయంలో చేతులెత్తేసిందని మండిపడ్డారు.
నిరుడు రైతులు పండించిన మిర్చి పంట ఉత్పత్తులు సైతం కోల్డ్ స్టోరేజీలోనే ఉన్నాయని తెలిపారు. రెండు నెలలుగా మిర్చి రైతులు మద్దతు ధర లేక అల్లాడుతున్నారని చెప్పారు. అంతర్జాతీయంగా నాణ్యతతో కూడిన మిర్చిని వరంగల్, తెలంగాణ జిల్లాల రైతులు పండిస్తున్నా మార్కెట్లో మిర్చికి కనీస మద్దతు ధర రాకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మిర్చి రైతులకు అండగా ఉంటుందని తెలిపారు.
రఘునాథపాలెం/ కాశీబుగ్గ, ఫిబ్రవరి 24: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం లక్షకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌కు 3లక్షల 70క్వింటాళ్లకు (7లక్షల బస్తాలు) పైగా మిర్చి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. తేజ రకం క్వింటాకు 13,500, వండర్‌హాట్ 16,200, దీపిక 17,300, దేశీ రకం మిర్చి 27వేలు, సింగిల్ పట్టి 26వేలు, బ్యాడ్గీ రకం 24వేలు, మధ్యరకం రూ.22వేలు, తాలు రకం 6వేలు ధర పలికాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తింది. రైతులు 1.05 లక్షల బస్తాలను తీసుకొచ్చారు. మిర్చి ధర రూ.14,125 పలికినా క్వింటాకు 500 నుంచి 1000 తగ్గించి కొనుగోళ్లు జరిపారు.