హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర తనదేనని, మీనాక్షి నటరాజన్‌ది కాదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలని పనిగట్టుకొని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. పదేండ్లు తానే సీఎం అని రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడంలో తప్పు లేదంటూనే.. వచ్చేసారి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అది కూడా కాంగ్రెస్ నుంచే అవుతారని వ్యాఖ్యానించారు. సీఎంకు, తనకు మధ్య విభేదాలు ఉన్నట్టు కొందరు విషప్రచారం చేస్తున్నారని, తమ మధ్య మంచి రిలేషన్ ఉన్నదని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఈ నెల 23 తర్వాత జనహిత రెండో దశ పాదయాత్రను ప్రారంభిస్తామని చెప్పారు.
తన పాదయాత్రలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు మధ్య లో జాయిన్ అవుతారని వివరించా రు. పాదయాత్ర సందర్భంగా కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రజల నుంచి ఎకువ విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల ధర్నాకు షెడ్యూల్ ప్రకారం రాహుల్‌గాంధీ మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సి ఉండగా, రాంచీ పర్యటన ఆలస్యం కావడంతో ఆయన రాలేకపోయారని వివరించారు. నాలుగైదు రోజుల్లో పీఏసీ సమావేశం ఉంటుందని, అందులో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి మాటలను క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తున్నదని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి చాలా మారారని పేర్కొన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని వెల్లడించారు. స్వయంప్రతిపత్తి గల సం స్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, ఈడీ, సీబీఐ కేసులన్నీ ప్రతిపక్షాలపైనే పెడుతున్నారని విమర్శించారు.