హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ కోవర్టులు ఉన్నారని, ఇరిగేషన్ కాం ట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చేసేది వారేనని, బిల్లులు నిలిపివేస్తే గాని వారికి బుద్ధి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై పీసీసీ సీరియస్ అయింది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ క్రమశిక్షణా కమిటీకి ఆదేశాలు జారీచేశారు. సోమవారం క్రమశిక్షణా కమిటీ సమావేశం ముగిసిన తర్వాత అనిరుద్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చే అ వకాశం ఉన్నట్టు సమాచారం.
సోమవారం క్రమశిక్షణా కమిటీ సమావేశం కానున్నట్టు కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ-మురళి దంపతులు, ఎమ్మెల్యేలపై వచ్చిన పరస్పర ఫిర్యాదుల విషయంలో ఇప్పటికే కొండా మురళి దంపతులు వివరణ ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్యేలను వివరణ కోరామని, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారని తెలిపారు. ఇది చిన్న విషయమని, ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయభేదాలు సహజమేనని, త్వరలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. మరోసారి వరంగల్ వివాదంపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నట్టు వెల్లడించారు.