హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదనే ప్రచారంలో వాస్తవం లేదని, వారికి పార్టీలో తగిన ప్రాతినిధ్యం కొనసాగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టంచేశారు. ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో మాదిరిగా సామాజిక న్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని, ఎస్సీలకు మొదటిసారిగా నాలుగు మంత్రి పదవులు కల్పించామని తెలిపారు.
బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
నాలుగు నెలల క్రితమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నదని, కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు పోవాలనుకోవడంతో ఆలస్యమైందని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నదని, దానిపై రాష్ర్టానికి చెందిన బీజేపీ మంత్రులు నోరు విప్పడం లేదని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నదని తెలిపారు.