ఢిల్లీ : బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో చుక్కెదురు కావడంతో.. ఈ అంశంపై వీలైనంత త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి మాట్లాడానని, ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని గౌడ్ చెప్పారు.
రాష్ట్రంలోని తాజా పరిణామాలను ఖర్గేకు వివరించినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. బీసీల రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి హైకోర్టులో జరిగిన వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలనుకుంటున్న విషయాన్ని కూడా ఖర్గేకు తెలిపినట్లు వెల్లడించారు. వీలైనంత త్వరలో బీసీ రిజర్వేషన్ల విషయంలో
సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తామన్నారు.
సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్య నేతల జూమ్ సమావేశం జరిగిందని పీసీసీ చీఫ్ తెలిపారు. ప్రభుత్వం వేసే పిటిషన్‌కు కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కూడా ఇన్ఫీల్డ్ అవుతారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, అదో చిన్న కమ్యూనికేషన్ సమస్య అని, తమదంతా ఒక కుటుంబమని, కూర్చుని పరిష్కరించుకుంటామని చెప్పారు.