హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో పరిస్థితులను బట్టే సీపీఐ, సీపీఎం, జనసమితి అభ్యర్థులకు మద్దతు ఇస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ బీసీకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. రెండు మూడు రోజుల్లో టికెట్ ఖరారు కావొచ్చని తెలిపారు. సీఎంతో చర్చించిన తర్వాత అభ్యర్థుల లిస్ట్ ఏఐసీసీకి పంపిస్తామని చెప్పారు.
ముగ్గురు ఇన్చార్జి మంత్రులు ఇచ్చే రిపోర్టు ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించామని, త్వరలోనే కామారెడ్డిలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం మద్దతు గురించి వేచి చూస్తున్నట్టు తెలిపారు.