హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక పూర్తిగా ఏకపక్షమని తేలిపోయింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యులు వెల్లడించిన అనేక విషయాలు రిపోర్టులోని డొల్లతననాన్ని బయటపెట్టాయి. విచారణ సందర్భంగా అధికారులు, రాజకీయ ప్రముఖులు, నీటిరంగనిపుణులు స్వచ్ఛందంగా హాజరై వెల్లడించిన అభిప్రాయాలను కమిషన్ ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని అర్థమవుతున్నది. కేంద్ర ఏజెన్సీలు సమర్పించిన నివేదికలను పరిశీలించలేదని కమిషనే స్వయంగా వెల్లడించడం గమనార్హం. కేవలం ప్రభుత్వం అందించిన అరకొర సమాచారంలోని విషయాలనే కావాల్సిన రీతిలో అన్వయించుకున్నది తప్ప తెలంగాణ ప్రాంత నేపథ్యాన్ని, నీటికోసం చేసిన పోరాటాన్ని ఏమాత్రం ఆకళింపు చేసుకోలేదని నివేదికనే చెప్తున్నది. సూటిగా చెప్పాలంటే ప్రభుత్వం ఏవైతే ఆరోపణలు చేసిందో, అందుకు అనుగుణంగానే రిపోర్టు ఉన్నదని నీటిరంగ నిపుణులు చెప్తున్నారు. విచారణ ప్రక్రియ సైతం 1952 కమిషన్ యాక్ట్‌కు విరుద్ధంగా కొనసాగిందని, ఆరోపణలు మోపిందే తప్ప, ఎక్కడా వాటిపై వాదనలను వినిపించుకునే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వలేదు. శాసనసభ వేదికగా సభ్యులు ప్రస్తావించిన, లేవనెత్తిన అంశా లు ప్రాజెక్టును కమిషన్ ఏమేరకు అధ్యయనం చేసిందన్న డొల్లతనాన్ని బహిర్గతం చేసింది.
శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలు
రాజకీయ ఆయుధంగా ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్నది. ఏ విచారణ కమిషనైనా విచారణ సందర్భంలో 1952 చట్టాన్ని మీర కూడదు. చట్ట పరిధిలో నిష్పాక్షికంగా విచారణ జరపాలి. పీసీ ఘోష్ కమిషన్ ఆ మార్గదర్శకాలను పాటించలేదు. 8(బీ) కింద నోటీసులు ఇవ్వలేదు. ఆ సెక్షన్ కింద నోటీసులివ్వకుండానే విచారణ చేసి, రిపోర్టు ఇస్తే అది చెల్లదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే తేల్చిచెప్పింది.
జస్టిస్ ఘోష్ రిపోర్టులో కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు లేవు? వారికి డ్యామ్ డ్యామేజీలో బాధ్యత లేదా? సీఎస్ రామకృష్ణారావు వంటి ప్రధాన అధికారులను ఎందుకు వదిలేశారు. అప్రూవర్‌గా మారారా? అలా అయితే మంచివాడా? నవయుగ, ఎల్అండ్టీ, ఆఫ్కాన్స్ కంపెనీలు ప్రాజెక్టులో పాల్గొంటే ఒక్క ఎల్అండ్టీ పేరు మాత్రమే నివేదికలో ఎందుకు వచ్చింది? మిగతా కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు తీసుకురాలేదు. వైఎస్ హయాంలో, ఇప్పుడు కూడా వారే కాంట్రాక్టర్లుగా ఉన్నారు. కాంట్రాక్టర్ల మీద కమిషన్ ఎందుకు మాట్లాడలేదు. ఎందుకు రక్షిస్తున్నది? కాంట్రాక్టర్లపై చర్యకు ఒక్క రికమండేషన్ కూడా నివేదికలో లేదు. ఇదేం కమిషన్? ఇదేం నివేదిక? వారు పార్టీలకు నిధులు ఇస్తారు కాబట్టి వారి పేరు లేదా?
క్యాబినెట్ ఆమోదం పొందక ముందే రిపోర్టు మీడియాకు ఎలా లీకైంది. ఎమ్మెల్యేలకు తెలియని సమాచారం మీడియాకు ఎలా తెలుస్తుంది? ఎవరు లీక్ చేశారు? ఇది సభను అవమానించడమే.
రూ. 6.78 కోట్లు రికవరి చేయాలని కమిషన్ వెల్లడించింది. కమిషన్ ఏర్పాటుకు 4 కోట్లు వరకు ఖర్చు చేశారు? అంత చేసి రికవరీ ఆ మేరకే ఆదేశించడానికి కమిషన్ ఎందుకు? మేడిగడ్డ బరాజ్ నిర్మాణానికి రూ. 4 వేల కోట్లు అయింది. ఇప్పుడు రిపేరు చేస్తే రూ. 350 కోట్ల వరకు అవుతాయి. అదీ సంస్థనే భరిస్తానంటుంది. మరేందుకు ప్రభుత్వం మరమ్మతు చేయించడం లేదు. కమిషన్ రిపోర్టుపై హడావుడిగా ఆదివారం చర్చ ఎందుకు పెట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతమాత్రం వైట్ ఎలిఫెంట్ కాదు. ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు స్థిరీకరించారు. ఈ విషయం అసెంబ్లీకి సమర్పించిన బుక్లోనే ఉన్నది. కానీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదని అంటున్నారు. కమిషన్ సైతం ఆదేవిధంగా రిపోర్టు ఇచ్చింది. అంటే ప్రాజెక్టును ఏమాత్రం అధ్యయనం చేయలేదని అర్థమువుతున్నది.
20 నెలల క్రితం కాంగ్రెస్‌కు ఓటేసి పాలన బాధ్యత కాంగ్రెస్‌కు అప్పగించారు. నివేదికపై ఏం చేద్దామని అడుగుతున్నారు? సీఐజీ, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టు పరిగణనలోకి తీసుకోలేదని కమిషనే స్పష్టంగా చెప్పింది. మరి ప్రభుత్వం ఎందుకు కమిషన్‌కు ఇవ్వలేదు? బరాజ్‌ల వైఫల్యాలకు కారణాలను చెప్పకుండా, సాంకేతిక పరీక్షలను నిర్వహించకుండా కమిషన్ నివేదిక ఎలా ఇచ్చింది. కమిషన్‌లో ఉన్న సాంకేతిక నిపుణులు ఎవరు? వారి చరిత్ర ఏమిటి? పొరుగు రాష్ట్రం అధికారులను, పలు ప్రాజెక్టుల వైఫల్యానికి కారణమైన వారిని కమిషన్‌కు అటాచ్ చేశారు. అలాంటి నివేదికను ఎలా నమ్మేది?
లక్షల కోట్ల అవినీతి అని ప్రచారం చేసి తుదకు ప్రకటించింది ఎంత? నివేదికలో సాధికారత ఎలా? పరిశీలించకుండా, కమిషన్ చివరికి ఏం చెప్పింది?
అంతిమ ఫలితం ఏమిటి?
ఇప్పుడు మేడిగడ్డ వద్ద లల క్యూసెకుల నీళ్లు ఉన్నా ఎందుకు కొట్టుకుపోలేదు? ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులు ఉమ్మడి పాలకులకు ఏటీఎంలుగా మారాయి. జలయజ్ఞాలు ధనయజ్ఞాలు అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ ప్రజాయోజనాల కోసం ప్రాజెక్టులు కట్టలేదు. ఇప్పటికీ ఏపీ దెబ్బతీస్తున్నది. 6 దశాబ్దాల పాటు జలదోపిడీకి గురైన తెలంగాణకు స్వల్పకాలంలో నీరివ్వాలని చూస్తే తొందర ఎలా అవుతుంది? తెలంగాణ నేపథ్యాన్ని ఘోష్ ఏమాత్రం పట్టించుకోలేదు. కేసీఆర్ వాదనలను చెవికెక్కించుకోలేదని, కేవలం కాంగ్రెస్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్నారని తేటతెల్లమవుతుంది.
n తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చుకోవాలని ఉమాభారతి, సీడబ్ల్యూసీ వెల్లడించింది. లేఖలు రాసింది. కానీ ఆ లేఖల్లోని కొన్ని పేరాలను మాత్రమే అనుకూలంగా తీసుకుని మార్పు తప్పని వెల్లడించింది. పూర్తి పేరాలను పెట్టలేదంటే కమిషన్ కావాలనే కాంగ్రెస్ అనుకూలమైన రిపోర్టును ఇచ్చిందని తేటతెల్లమవుతున్నది. ఇవే కాదు. అనేక అంశాల్లో అధికారులు, కేంద్ర సంస్థ నివేదికలను పూర్తిగా పరిశీలించలేదు. ప్రాణహిత-చేవేళ్లలో ప్రతిపాదిత, కాళేశ్వరంలో పెరిగిన నీటివినియోగ, నీటి నిల్వ, పంపింగ్, ఆయకట్లు సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోకుండానే అవినీతి అని వ్యాఖ్యానించడాన్ని బట్టి కమిషన్ ఏమేరకు ప్రాజెక్టును పరిశీలించిందో తెలిసిపోతుంది.