హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదురొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రెండు నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర అంగన్వాడీ(మినీ) టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక, అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలిసి మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓఝౌకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కేవలం 10 జిల్లాలకే ఏప్రిల్ నెల జీతాలు అందాయని తెలిపారు. మిగిలిన 23 జిల్లాల టీచర్లకు వేతనం మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు 12 నెలలుగా వేతనాలు పెండింగ్ లో పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రతినెలా నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, జీతాల కోసం వినతిపత్రాలు ఇస్తూ, అడుకోవాల్సిన పరిస్థితి రావడం శోచనీయమని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కవిత, శోభ, శైలజ తదితరులు పాల్గొన్నారు.