హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : పెన్షన్ ప్రయోజనాలను నాలుగు వారాల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో బిల్లుకు సంబంధించి టోకెన్ నంబర్ జారీ అయిన తేదీ నుంచి చెల్లింపు చేసే వరకు 18% వార్షిక వడ్డీని కట్టి ఇవ్వాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన ఓ రిటైర్డు ఉద్యోగికి చెల్లించాల్సిన పెన్షన్ ప్రయోజనాలను ఈనెల 21 నుంచి నాలుగు వారాల్లోగా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీ సామ్‌కోషి, జస్టిస్ నందికొండ నర్సింగరావుతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏవోగా పని చేసిన విజయ్‌కుమార్ ఆరు నెలల క్రితం రిటైర్డ్ అయ్యారు. జీపీఎఫ్తోపాటు ఇతర ప్రయోజనాలు కలిపి ఆయనకు రూ.90లక్షలు రావాల్సి ఉండగా.. ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వాదనలు విన్న కోర్టు నాలుగు వారాల్లోగా విజయ్‌కుమార్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించింది.