బొంరాస్‌పేట, అక్టోబర్ 8 : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే బాధిత గ్రామాలకు చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయ ముట్టడి, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించి తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ప్రభుత్వం ఫార్మా ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నది. ఇందులో భాగంగా భూ సేకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేయడంతో రైతులు భగ్గమంటున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుని బతుకుతున్న భూములను సర్కారు లాగేసుకుంటే ఎలా బతకాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఫార్మా విలేజ్ ఏర్పాటు వల్ల నీటి, వాయు కాలుష్యం ఏర్పడి పంటలు పండవని, ప్రజల జీవనం దుర్భరంగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దుద్యాల మండలం హకీంపేట చౌరస్తాలో నెల రోజులుగా రైతులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు.
ఫార్మా విలేజ్‌పై రైతుల ఆందోళనను రేవంత్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పోలేపల్లిలోని సర్వే నంబరు 67లో 130 ఎకరాలు, హకీంపేటలోని 252 సర్వే నంబరులో 366 ఎకరాలు, లగచెర్లలో 102 సర్వే నంబరులో 140 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే ప్రభుత్వ భూమి ఫార్మా విలేజ్‌కు సరిపోకపోవడంతో ప్రభుత్వ, పట్టా భూములను కలిపి మూడు గ్రామాల పరిధిలో మొత్తం 1274.25 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. హకీంపేటలో 505.37 ఎకరాలు, పోలేపల్లిలో 130 ఎకరాలు, లగచెర్లలో 643 ఎకరాలను ఫార్మా విలేజ్ కోసం సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే లగచెర్ల గ్రామ పరిధిలోని 632.26 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల పట్టా భూములను సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా పట్నం నరేందర్‌రెడ్డి చేపడుతున్న పాదయాత్రను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నది. బుధవారం పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయానికి రావాలని కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భూములు కోల్పోతున్న రైతులకు భరోసా ఇవ్వాల్సిన అధికార పార్టీ నాయకులు ఇలా వ్యవహరించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫార్మా విలేజ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బుధవారం పాదయాత్రకు సిద్ధమయ్యారు. దుద్యాల మండలం పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయంలో ఉదయం పూజలు చేసి అక్కడి నుంచి హకీంపేట, పులిచెర్లకుంటతండా, రోటిబండతండా, లగచెర్ల గ్రామాల మీదుగా దుద్యాల మండల కేంద్రం వరకు పాదయాత్ర చేపడతారు. తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ పాదయాత్రకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. పాదయాత్రకు మద్దతుగా ఫార్మా బాధిత గ్రామాల రైతులతోపాటు వివిధ మండలాల నుంచి రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనే అవకాశం ఉన్నది.