మద్దూర్(కొత్తపల్లి), జూన్ 22 : సన్నాలకు బోనస్ ఇవ్వని ఈ సన్నాసి ప్రభుత్వం రైతులను దగా చేసిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించా రు. సోమవారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనీడులో జరిగిన రైతు రిలే నిరాహారదీక్షలో ఆయన మాట్లాడారు.
ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటి ఊసెత్తకుండా ప్రశ్నించే వారిని బెదిరిస్తూ కొత్త రాజకీయాలకు తెరలేపిందని విమర్శించారు. మోసపోతే గోస పడుతామని కేసీఆర్ ముందే చెప్పారని.. ఇప్పుడు నూటికి నూరు శాతం అదే జరిగిందని అన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రైతులకు మంచి రోజులు వస్తాయని గుర్తుచేశారు. కేసీఆర్ రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి కాంగ్రెస్ సర్కార్ బొందపెట్టిందని విమర్శించారు.