Sircilla Hospital | సిరిసిల్ల టౌన్, జనవరి 5: బీఆర్ఎస్ ప్ర భుత్వంలో ఓ వెలుగు వెలిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖాన ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గాడి తప్పింది. రోగులకు వైద్యం దేవుడెరుగు.. మధ్యాహ్నం పూట పట్టెడన్నం పెట్టలేని దుస్థితికి చేరింది. రోగులకు పంపి ణీ చేసిన భోజనంలో పురుగులు రావడం ప్రభుత్వ పరిస్థితికి అద్దం పడుతున్నది. సోమవారం రోజువారీలాగే దవాఖాన సిబ్బంది రోగులకు క్యాలీఫ్లవర్-టమాటకూర, అన్నం పెట్టారు. భోజనంలో పురుగులు కనిపించడంతో రోగులు ఆందోళన వ్యక్తంచేశారు.
వెంటనే సిబ్బందిని నిలదీయడంతో వారు అప్రమత్తమై భోజనాన్ని తొలగించారు. అప్పటికే అక్కడ ఉన్న రోగు ల బంధువులు మొబైల్ ఫోన్లో పురుగుల అన్నం ఫొటోలు తీసుకోగా, సిబ్బంది వెళ్లి ఫోన్లు గుంజుకొని డిలీట్ చేశారు. అన్నం లో పురుగులు రావడంపై రోగుల బంధువు ఒకరు సూపరింటెండెంట్‌ను ఫోన్లో ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ‘పురుగులు వచ్చాయి, ఎవరికీ ఏమీ జరుగలేదు కదా? సంబంధిత కాంట్రాక్టర్ వివరణ తీసుకుంటా, తిన్నవారికి ఏదైనా జరిగితేనే చర్యలు తీసుకుంటాం’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని సదరు వ్యక్తి ఆరోపించారు.
అన్నీ మంచిగ చూస్తరనే గవర్నమెంట్ దవాఖానకు వచ్చినం. ఆకలితో ఉన్న పేషెంట్ కోసం ప్లేట్ పడితే పురుగులు ఉన్న అన్నం పెట్టిండ్రు. అది తింటే కొత్త రోగాలు రావా..? గవర్నమెంట్ దవాఖానకు వచ్చేటోళ్లంటే గింత అలుసెందుకు. వంట చేసే ముందు బియ్యం, పప్పులు మంచిగ చూసుకోవాలి కదా. ఇంట్లో వాళ్లకైతే గిట్లనే పెడతారా..? పెద్ద సార్లు పట్టించుకుని వాళ్ల మీద చర్యలు తీసుకోవాలి.
– రాజేశ్వరి, బండపల్లి, చందుర్తి మండలం