హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : కుమ్రంభీం ఆసిఫాబాద్ విద్యార్థిని మమత అరుదైన గుర్తింపు పొందింది. ఆమె రూపొందించిన ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ హక్కులు జారీచేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్‌మార్క్స్ కార్యాలయం పేటెంట్ రిజిస్ట్రేషన్‌ను జారీచేసింది. జిల్లాలోని సిర్పూర్(టీ) మండలం అందవెల్లి గ్రామ పరిధిలోని భూపాలపట్నం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అల్సా మమత.. రద్దీ ప్రదేశాల్లో పార్కింగ్ నిర్వహణ (పార్కింగ్ మేనేజ్మెంట్ ఇన్ క్రౌడెడ్ ప్లేసెస్) ప్రాజెక్ట్‌ను రూపొందించింది. స్కూళ్లు, దవాఖానలు, షాపింగ్‌మాల్స్‌లో పార్కింగ్ స్థలం ఖాళీగా ఉందో లేదో తెలుసుకునే సాంకేతికను రూపొందించి పేటెంట్ హక్కులను సొంతం చేసుకున్నది.