TGS RTC | హుజూరాబాద్ టౌన్/తాడ్వాయి, ఆగస్టు 22: ఆర్టీసీ బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో.. ఓవర్ లోడ్ బస్సులను నడపలేమంటూ ఇద్దరు డ్రైవర్లు రెండుచోట్ల బస్సులను నడిరోడ్డుపైనే నిలిపారు. ఇలాగైతే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని, వెంటనే బస్సు దిగాలని ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను వేడుకున్నా వినిపించుకోలేదు. పైగా ‘బస్సు నీ అయ్యదా? నీదా? ఎవలం దిగేది లేదు.. బస్సు పోనియ్యు’ అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనలు గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటుచేసుకున్నాయి.
సిరిసిల్ల బస్సు వరంగల్ వెళ్తుండగా హుజూరాబాద్ బస్టాండ్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. డ్రైవర్ చెప్పినా బస్సు దిగలేదు. ఓవర్ లోడ్తోనే బస్సును బస్టాండ్ నుంచి బయటకు తీసుకొచ్చి నడిరోడ్డుపైనే నిలిపారు. ప్రయాణికులు సహకరిస్తేనే బస్సు ముందుకు కదులుతుందని చెప్పారు. ఎట్టకేలకు ప్రయాణికులు సహకరించడంతో బస్సు ముందుకు కదిలింది. కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు భూపాలపల్లికి వెళ్లేందుకు మధ్యాహ్నం ప్రయాణికులతో తాడ్వాయికి చేరుకుంది.
అక్కడ ఒకే బస్సులో 130 మంది ప్రయాణికులు ఎక్కారు. దీంతో కండక్టర్ కొంత మంది బస్సు దిగాలని, వెనుక వచ్చే బస్సులో ఎక్కాలని సూచించారు. తన మాటను వినకుండా కొందరు మహిళలు వాగ్వాదానికి దిగారు. మహిళల మాటలకు తాళలేక డ్రైవర్ బస్సు దిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని వెళ్లేందుకు యత్నించారు. బస్సులో ఉన్న పురుష ప్రయాణికులు డ్రైవర్ను సముదాయించడంతో సుమారు 60 మంది ప్రయాణికులు బస్సు దిగారు. డ్రైవర్ 70 మంది ప్రయాణికులతో బస్సు భూపాలపల్లికి వెళ్లిపోయారు.