హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు మంత్రులు, అఖిలపక్ష నేతలు, పీసీసీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశా రు. రాజ్‌భవన్‌లో సోమవారం ఉదయం గవర్నర్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్, సీపీఐ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరు లు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న 50% రిజర్వేషన్ పరిమితి నిబంధనను ఎత్తివేస్తూ, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, మూడ్ ఆఫ్ హౌస్‌ను పరిగణనలోకి తీసుకొని బిల్లుకు ఆమోదం తెలుపాలని గవర్నర్‌ను కోరారు.
బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు : వివేకానందగౌడ్
బీసీలకు రిజర్వేషన్ పెంచే విషయంలో బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌ డ్ తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ పెంపు విషయంలో లీగల్ చిక్కులు రాకుండా చూడాలని బీఆర్ఎస్ చెప్తున్నదని గుర్తుచేశారు.