హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ‘రాశి కంటే వాసి ముఖ్యమని నేను భావిస్తా. పేరుకు లక్ష దాటింది, రెండు లక్షలు దాటింది అన్నట్టు కాకుండా చాలా క్వాలిటేటివ్‌గా పని చేయండి.. నిజంగా, నికరంగా ఎంతైతే మెంబర్ షిప్ అవుతుందో అదే పద్ధతుల్లో చేయాలి’ అని బీఆర్ఎస్ నాయకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. క్రియాశీలక సభ్యులు కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ బూత్ లెవల్ నుంచి స్టేట్ కమిటీ దాకా టాప్ టు బాటమ్ మళ్లీ పార్టీ పునర్నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. తేదీలు త్వరలోనే చెప్తామని వెల్లడించారు. సోమవారం పార్టీ ఆవిర్భావ వేడుకల అనంతరం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న పలు నిర్ణయాలు, తీర్మానాలను మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేపర్ వర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకం, ఎన్నికల ప్రక్రియ, బుక్స్ ప్రింటింగ్ వంటి వాటికి కొంత సమయం కావాలని, ఆ ప్రక్రియ పూర్తవ్వగానే కేసీఆర్ ఆధ్వర్యంలో మరో సమావేశం ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకూ ఉన్న కమిటీలు రద్దు చేసి, కొత్త కమిటీల ఏర్పాటుకు అడుగు ముందుకు వేసినట్టు తెలిపారు.
స్టేట్ కమిటీ మినహా.. కమిటీలన్నీ రద్దు
రాష్ట్రంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు, నాయకులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టిసారించాలని కేటీఆర్ సూచించారు. ఈ క్రమంలో ఒక్క స్టేట్ కమిటీ మినహా రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి అన్ని కమిటీలనూ రద్దు చేసినట్టు కేటీఆర్ వెల్లడించారు. ‘కొత్తగా సభ్యత్వ నమోదు తర్వాత మళ్లీ కమిటీలు, జిల్లాలకు కొత్తగా పార్టీ అధ్యక్షుల నియామకం ఉంటుంది. దానికో ఫార్మాట్ ఉన్నది. ప్రిసైడింగ్ ఆఫీసర్ నియామకం చేయాలి. ఎవరైనా పోటీ పడదల్చుకుంటే పోటీ పడొచ్చు. ఆ ప్రక్రియ మొత్తం సాఫీగా కొనసాగడానికి స్టేట్ కమిటీ ఉంటుంది’ అని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎల్.రమణ వంటి పెద్దలు దీనిపై వర్క్ చేస్తున్నారని తెలిపారు. ‘సభ్యత్వాలను పర్యవేక్షించడానికి స్టేట్ లెవల్ కమిటీ ఉండాలి. ప్రతి నియోజకవర్గానికీ అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లను కూడా నియమించాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గానికీ స్పెషల్‌గా స్టేట్ పార్టీ నుంచే కో ఆర్డినేటర్లను పంపిస్తాం. దానికోసం స్టేట్ కమిటీ ఒకటి లైవ్ ఉంటుంది’ అని తెలిపారు.
ఎస్ఐఆర్ విషయంలో అప్రమత్తం
ఎస్ఐఆర్ విషయంలో ఇప్పటిదాకా అప్రమత్తమంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ‘బీహార్ ఎన్నికల సందర్భంగానే మా టీమ్.. నా ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను కలిశాం. మా విజ్ఞప్తి మేరకే ఎస్ఐఆర్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. బూత్ లెవల్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ అనేది నాడు బీఆర్ఎస్ ప్రతిపాదించిందే’ అని వివరించారు. ఈ క్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం ఇప్పటికే దాదాపుగా 90 నియోజకవర్గాల్లో పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన నియోజకవర్గాల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు. ‘బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) సమన్వయం చేసుకుని పారదర్శకంగా ఈ ప్రక్రియ ముందుకుసాగడానికి పార్టీ వైపు నుంచి విజిలెంట్‌గా ఉండాలని అధ్యక్షుడు సూచించారు. దానికి అనుగుణంగా ముందుకు నడుద్దాం. ఈ విషయంలో కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘తేజస్వీ’పై మొదట స్పందించిందే బీఆర్ఎస్
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ విభజనపై మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు అని కేటీఆర్ గుర్తుచేశారు. వారిద్దరూ ఖండించడమే కా దు.. పార్లమెంట్లో గట్టిగా నిలదీశారని చెప్పా రు. అప్పుడు తేజస్వీ సూర్య తనకు ఫోన్ చేసి ‘బ్రదర్ నేనేదో అన్నాను. మీ వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని అంటే ‘లేదండీ మీరు మాట్లాడింది చాలా తప్పు’ అని ఫోన్లోనే తీ వ్రంగా చెప్పినట్టు తెలిపారు. ‘మీరు చాలా మంది హృదయాలను గాయపరిచేలా మాట్లాడారు. మీరు మాట్లాడింది చాలా తప్పు. ఆ వ్యాఖ్యలను విరమించుకోండి.. ఉపసంహరించుకోండి. మీ పార్టీ అభిప్రాయమా? వ్యక్తిగత అభిప్రాయమా? నాకు తెల్వదు. బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు’ అని ఆనాడే గట్టిగా చెప్పినట్టు వివరించారు. బీఆర్ఎస్ ఖండించిన తర్వాతే ఆయన వివరణ ఇచ్చుకున్నారని చెప్పారు. ‘ఒకటి మాత్రం పకా.. బీ ఆర్ఎస్ సభ్యులు లోక్‌సభలో ఉండి ఉంటే.. తేజస్వీ సూర్య పనికిమాలిన మాటలకు మనోళ్లు కస్సుమని లేచేటోళ్లు. వెంట నే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్లు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8=0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది’ అని దుయ్యబట్టారు. తెలంగాణను తూలనాడేలా.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేలా తేజస్వీ మాట్లాడిన విధానాన్ని సమావేశం తీవ్రంగా ఖండించిందని చెప్పారు.

సీఎం నోటి మాటకు విలువ ఉన్నదా?
‘దేవుండ్ల మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తాం అని చెప్పి తప్పినోడి గురించి ఏం మాట్లాడుతాం? దేవుండ్లందరినీ ఆగం చేసిండు రేవంత్‌రెడ్డి. బాసర పోయి సరస్వతమ్మ మీద ఒట్టన్నడు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టన్నడు. జోగుళాంబ పోయి ఒట్టు పెట్టిండు. ఆ ఒట్లు గట్టు మీద పెట్టి మర్చిపోయిండు. గట్లాంటి ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడుమంటరు? ఏం చెప్పుమంటరు? ఆయన నోటికి, మాటకు విలువ ఉన్నదా?’ అంటూ కేటీఆర్ తూర్పారబట్టారు. ‘రేవంత్‌రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్. ఆయనను ఎకడికి పోయినా ముఖ్యమంత్రి అని గుర్తు పడుతలేరు. కేసీఆర్ ఒకసారైనా ఆయన పేరు తీసుకుంటాడేమో అని దేవులాడుతుండు. ఆయన బాధ వర్ణనాతీతం. యాంకర్లు గుర్తు పట్టట్లేదు.. యాక్టర్లు గుర్తు పట్టట్లేదు.. ప్రజలు గుర్తు పట్టట్లేదు.. ప్రతిపక్ష నాయకుడు కూడా మిమ్మల్ని గుర్తు పట్టట్లేదు. అది మీ ఐడెంటిటీ క్రైసిస్‌కి సంబంధించిన సమస్య. కావాలంటే మీరు ‘ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం’ అని చెప్పి ఓ బ్యానర్ కట్టుకొని ఊరూరా తిరగండి.. మేమెందుకు వద్దంటం?’ అని కేటీఆర్ చురకలంటించారు.
చీఫ్ మినిస్టర్ చీప్ మాటలా
ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చీప్‌గా మాట్లాడితే బాగుండదని కేటీఆర్ హితవుపలికారు. చీఫ్ మినిస్టర్‌గా ఏదైనా విధానపరమైన విష యం మీద మాట్లాడితే ప్రధాన ప్రతిపక్షంగా తాము స్పందిస్తామని, జవాబు ఇస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఎంతసేసూ విషం చిమ్మడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పర్సనల్‌గా గలీజ్ మాటలు మాట్లాడటం తప్ప ఇంకోటి రాదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎక్స్పైర్ అయిపోయిందని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ చతికిలబడి ఇప్పటికి 13 ఏండ్లు అయిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు లేవలేకపోతున్న విషయం గుర్తుంచుకోవాలని చురకలంటించారు. ‘మొదట వాళ్ల స్థాయి, వాళ్ల పరిస్థితి చూసుకోవాలి. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయ్యుండి.. ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఏందో.. మా పార్టీ ప్రస్థానమేందో.. ఏం చేసిందో.. ఎట్లా ప్రజా పోరాటాలు చేసి ఢిల్లీ మెడలు వంచి ఒక రాష్ట్రాన్ని సాధించిందో.. వాళ్ల జాతీయ నాయకత్వాన్ని, ఢిల్లీని ఎట్లా గడగడలాడించిందో కాంగ్రెస్ జాతీయ నాయకులను అడిగితే చెప్తారు. ఈయనకేం తెలుసు? అప్పుడు ఈయన ఎకడున్నడు?’ అని నిలదీశారు. ‘చీఫ్ మినిస్టర్.. చీప్ మాటలు మాట్లాడకపోతే మంచిది’ అని హితవు పలికారు. డైవర్షన్ కోసం ఆయన చేసేది చిట్‌చాట్ కాదని.. చీట్‌చాట్ అని ఎద్దేవాచేశారు.
వ్యవసాయరంగ సంక్షోభంపై చర్చించాం
రాష్ట్రంలో వ్యవసాయ రంగం మళ్లీ ఎలా సంక్షోభానికి గురైందో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో విస్తృతంగా చర్చించామని కేటీఆర్ తెలిపారు. రైతుబంధు వంటి అద్భుతమైన పథకాన్ని ప్రపంచంలో ఎకడా లేని విధంగా తీసుకువచ్చి రైతన్నలకు అందించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. యునైటెడ్ నేషన్స్ కూడా ప్రశంసించిన రైతుబంధు లాంటి పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? ఏ కారణం చేత రైతుబంధు పథకం తీసుకువచ్చామో కేసీఆర్ వివరించారని తెలిపారు. అదే రైతుబంధును కాంగ్రెస్ ఎట్లా నిర్వీర్యం చేస్తున్నది? ఏ రకంగా ఒక్కో ఎకరానికే ఒక్కో దఫా పైసలు వేస్తున్నది? ఎంత చండాలంగా ప్రచారం చేసుకుంటున్నది? అనేవి కేసీఆర్ వివరించారని పేర్కొన్నారు. దీంతో పాటు పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం, సాగునీటి స్థితిగతులు, ఇకడ విద్యుత్తు కొరత, రాష్ట్ర ఏర్పాటుకు నడుం బిగించాల్సిన పరిస్థితులను కేసీఆర్ వివరంగా తెలిపారని చెప్పారు. నాడు పదవులను తృణప్రాయంగా త్యజిస్తూ, ఎప్పటికప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికలను ఆహ్వానిస్తూ ఏ రకంగా ముందుకు పోయామో వివరంగా చెప్పినట్టు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఏ రకమైన పరిపాలన జరిగింది? ఎంత ఉద్విగ్నతతో పని చేశామో వివరంగా చెప్పారని, అందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించేందుకు కలిసి వచ్చిన ప్రతి ఒకరికీ కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారని వివరించారు.
డీలిమిటేషన్‌తో మహిళలను మోసగించే కుట్ర
మహిళా రిజర్వేషన్ల బిల్లును బీజేపీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నదని కేటీఆర్ చెప్పారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టి అనవసరంగా లేని ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి మొత్తానికి మహిళా లోకాన్ని, దేశ ప్రజలను బీజేపీ గందరగోళంలోకి నెట్టిందని విమర్శించారు.
30 ఏండ్లుగా మహిళా బిల్లుపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని, తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చట్టసభల్లో తీర్మానాలు చేశామని చెప్పారు. శాసనసభ, మండలిలో వెంటనే 1/3 రిజర్వేషన్లను చట్టసభల్లో అమలు చేయాలని నాడే తీర్మానాలు చేశామని తెలిపారు. పార్టీ విసృ్తత స్థాయి సమావేశంలోనూ మహిళా రిజర్వేషన్లపై పూర్తి చిత్తశుద్ధిని మళ్లీ వ్యక్తం చేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. ‘ఓట్ల తొలగింపు ప్రక్రియ ఒక నాటకం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 15 వేల దొంగ ఓట్ల చేర్పుతో ఓడిపోయాం’ అని చెప్పారు. అందుకే ఎస్ఐఆర్పై పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా ఉండాలని తెలిపారు.
బీఆర్ఎస్ తీర్మానాలు ఇవే..
పార్టీలు వస్తుంటయ్.. పోతుంటయ్.. అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినయ్.. పోయినయ్. 25 ఏండ్లు పూర్తి చేసుకున్న పార్టీ బీఆర్ఎస్. మేము ఫోకస్ చేసేది ప్రజా సమస్యలపైనే. ఈ దేశంలో 25 ఏండ్లు పూర్తి చేసుకున్న పార్టీలను వేళ్ల మీద లెకపెట్టొచ్చు. మనదగ్గర టీడీపీ, తర్వాత బీఆర్ఎస్ మాత్రమే. వేరే పార్టీలేం లేవు. కాబట్టి కొత్తవాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.-కేటీఆర్
రాష్ట్రంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు, నాయకులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టిసారించాలి. ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పని చేయాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్రియాశీలంగా పని చేయకుంటే పార్టీ అన్నీ పరిగణనలోకి తీసుకుంటుంది. క్రియాశీలంగా ఉండండి.. కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండండి. పార్టీ ఇచ్చిన టాస్‌లను సవ్యంగా పూర్తి చేయండి. పార్టీ అన్నీ గమనిస్తుంది. రేపు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ
పరిగణనలోకి తీసుకుంటం.
-కేటీఆర్
రేవంత్‌రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్. ఆయనను ఎకడికి పోయినా ముఖ్యమంత్రి అని గుర్తు పడ్తలేరు. ఒకసారైనా కేసీఆర్ తన పేరు తీసుకుంటాడేమో అని దేవులాడుకుంటుండు. ఆయన బాధ వర్ణనాతీతం. యాంకర్లు గుర్తు పడ్తలేరు. యాక్టర్లు గుర్తు పడ్తలేరు.. ప్రజలు గుర్తు పడ్తలేరు. ప్రతిపక్ష నాయకుడు కూడా గుర్తు పడ్తలేరు. గుర్తింపు కావాలంటే మీరు ‘ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం’ అని చెప్పి ఓ బ్యానర్ కట్టుకొని ఊరూరా తిరుగండి.. మేమెందుకు వద్దంటం?
-కేటీఆర్