హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ సంబురం అంబరాన్నంటింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పండుగ అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వేలాది కార్యకర్తల కోలాహలం నడుమ మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పతాకావిష్కరణ చేశారు. అదే విధంగా జిల్లా, నియోజకవర్గ, మండలకేంద్రాలతోపాటు ఊరూవాడల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు గులాబీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం అమరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలు వేసి స్వరాష్ట్రం కోసం కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ పోరాటాన్ని, ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, ఎమ్మెల్యేలు వివేకానంద్‌గౌడ్, కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర నేతలు దేవీప్రసాద్, సుమిత్రా ఆనంద్, గ్యాదరి బాలమల్లు, గోసుల శ్రీనివాస్‌యాదవ్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, వై సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ నేతృత్వంలో 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, ఎందరో అమరుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ.. ఇవాళ అరాచక శక్తుల చేతుల్లో బందీ అయ్యిందని, స్వరాష్ర్టాన్ని కాపాడుకొనేందుకు మళ్లీ మనమంతా పునరంకితం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ భవన్లో ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండున్నర దశాబ్దాలుగా ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు, కేసీఆర్ అభిమానులు, మీడియా మిత్రులు, సోషల్ మీడియా వారియర్స్, కవులు, కళాకారులు, ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, న్యాయవాదులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
దశాబ్దాలుగా దగా పడి, అన్యాయానికి గురై నెత్తురు మండే జాతి ఎత్తిందే గులాబీ జెండా అని కేటీఆర్ పేర్కొన్నారు. స్వీయ రాజకీయ శక్తితోనే తెలంగాణ సమస్యలకు చరమగీతం పాడొచ్చనే సంకల్పంతో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్, ఎమ్మె ల్యే పదవులను త్యజించి గులాబీ పార్టీకి ఊపిరిపోసి ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. దేశంలో 25 వసంతాలు పూర్తిచేసుకొన్న రెండు, మూడు పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటికావడం గర్వకారణమని చెప్పారు. సమస్యలపై ఉద్యమిస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్నదని చెప్పారు. అరాచక కాంగ్రె స్, బీజేపీల నుంచి కాపాడుకొనేందుకు సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. 2028లో కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేదాకా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలగంగా దళంగా కదంతొక్కుదామని పిలుపునిచ్చారు.